తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతోంది. పక్క భాషలు రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు హిందీలోనూ అదిరిపోయే మార్కెట్ ఏర్పడింది. తమిళ, మలయాళం సంగతి ఇక చెప్పక్కర్లెద్దు. కొన్ని సినిమాలకు ఊహించని రేట్లు పలుకుతున్నాయి. తాజాగా భాగమతికి తమిళ రైట్స్ రూ.15 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని తమిళంలో విడుదల చేయడానికి ముందుకొచ్చింది. ఫ్యాన్సీ ఆఫర్ క్రింద రూ.15 కోట్లకు ఈ సినిమా అమ్మేశార్ట. అనుష్క బ్రాండ్ భాగమతి విషయంలో బాగా వర్కవుట్ అయినట్టు కనిపిస్తోంది. యువీ క్రియేషన్స్ కున్న క్రేజ్, స్టూడియో గ్రీన్‌తో ఈ సంస్థకు ఉన్న అనుబంధం వెరసి… ‘భాగమతి’కి ఇంత మంచి రేటు తెచ్చిపెట్టాయి. హిందీ మార్కెట్ నుంచి కూడా ఫ్యాన్సీ ఆఫర్ వస్తుందని యువీ క్రియేషన్స్ ఎదురుచూస్తోంది. ఎంతకాదన్నా… డబ్బింగ్ రైట్స్‌కే రూ.5 కోట్ల వరకూ వస్తుందని అంచనా. అంటే రూ.20 కోట్ల రూపాయలే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తోంది. ఈ సినిమాపై యూవీ క్రియేషన్స్ దాదాపుగా రూ.40 కోట్ల పెట్టుబడి పెట్టింది. సగం డబ్బులు తమిళ, హిందీ భాషల నుంచే వచ్చేస్తే ఇంకేం కావాలి??