చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయాన్ని అందుకొంది బేబీ. తెలుగులో రూ50 కోట్లు అందుకొంది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలక్షన్లు సాధించడం తెలుగు చిత్రసీమకు శుభపరిణామం. అందుకే మిగిలిన భాషల దృష్టీ ఈ సినిమాపై పడింది. బేబీ టాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా తమిళ, హిందీ చిత్రసీమల నుంచి.. బేబీ రీమేక్‌కు ఫ్యాన్సీ ఆఫర్లు లభిస్తున్నాయి. రీమేక్ రైట్స్ ఇస్తే చాలు లాభాల్లో 50 శాతం వాటా ఇస్తామంటూ బేరాలు తీసుకొస్తున్నార్ట. నిజానికి ఇది చాలా మంచి ఆఫరే. చేతి నుంచి చిల్లి గవ్వ పెట్టాల్సిన పనిలేదు. కొడితే… ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేయొచ్చు. అందుకే బేబీ నిర్మాత ఎస్కేఎన్ ఈ దిశగా ప్రణాళికలు వేసుకొంటున్నారు. బేబీ సినిమాని దాదాపుగా అన్ని భాషల్లోనూ రీమేక్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు టాక్. ముందు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్థానిక నిర్మాతలతో టై అప్ అయి సినిమాని నిర్మించాలా? లేదంటే అక్కడ కూడా సొంత సంస్థలోనే సినిమా చేసి, విడుదల చేయాలా? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే బేబీ రీమేక్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే సీజన్లో విడుదలైన `సామజవరగమన` సినిమానీ రీమేక్ చేసే ఆలోచనల్లో ఉన్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ డీల్ దాదాపు క్లోజ్ అయినట్టు టాక్.