నాగార్జున జోరు ఈమధ్య బాగా తగ్గిపోయింది. ఆయన ఏ సినిమా చేసినా బజ్ ఉండడం లేదు. బాక్సాఫీసు దగ్గర నిలబడడం లేదు. అంతెందుకు.. కనీసం ఓపెనింగ్స్ ఉండడం లేదు. నాగ్ కథల ఎంపిక, ఆయన జడ్జిమెంట్. ఆయన క్రేజ్‌పై జనాలకు కొత్త డౌట్లు క్రియేట్ అయిపోయాయి. ఘోస్ట్ తరవాత నాగార్జున మరో సినిమా మొదలెట్టడానికి చాలా టైమ్ తీసుకొన్నారు. మధ్యలో కొన్ని కథలు విన్నారు. పక్కన పెట్టేశారు. ఆయన వందో సినిమా గురించి కూడా పెద్దగా ఆలోచించినట్టు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో నాగ్ నుంచి `నాసామి రంగ` ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఫస్ట్ గ్లింప్స్‌లో నాగ్ మాస్ అవతార్.. అభిమానులకే కాదు అందరికీ నచ్చింది. నాగ్ ని అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో అలాంటి పాత్రలో ఆయన కనిపించారు. రొమాంటిక్, స్టైలీష్ పాత్రల మోజుతో చాలా కాలంగా నాగ్ తన మాస్ ని తనలోనే దాచేసుకొన్నారు. ఎట్టకేలకు అది బయటకు వచ్చింది. నిజానికి ఇదో రీమేక్. నాగ్ ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు అనగానే సగం ఉత్సాహం నీరుగారిపోయింది. ఎందుకంటే ఈ మధ్య రీమేకు ఆటలు చెల్లడం లేదు. అసలు రీమేకులు వద్దని జనాలే గొడవ చేస్తున్నారు. ఈదశలో నాగ్ ఉద్ధరించేది ఏముందని ఈ కాంబోని లైట్ తీసుకొన్నారు. కానీ ఫస్ట్ లుక్, అందులో నాగ్ ప్రజెన్స్, టైటిల్, కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చూసేసరికి అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టైంది.