ప్రాజెక్ట్ కె పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ బజ్ నడుస్తోంది. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఈ సినిమాకి ఉందన్నది అందరి నమ్మకం. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్లతో ఈ సినిమా నింపేశారు. మరింత మంది స్టార్లు ఈ సినిమాలో భాగం కానున్నారు. బడ్జెట్ పరంగా, క్రేజ్ పరంగా, స్టార్స్ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది ఈ సినిమా.
అయితే ప్రాజెక్ట్ కె నుంచి ఇప్పటి వరకూ వచ్చిన రెండు లుక్కులూ…. ప్రభాస్ అభిమానుల్ని, సినీ ప్రేమికుల్ని, ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తి కనబరుస్తున్నవారినీ ఏమాత్రం సంతృప్తి పరచడం లేదు. ముందుగా దీపికా పదుకొణె లుక్ బయటకు వచ్చింది. సినిమా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన లుక్లా అణువంత కూడా అనిపించని ఫస్ట్ లుక్ అది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి దిగిన సెల్ఫీలా అనిపించింది. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా నీరసాలు వచ్చేశాయి.
ఇప్పుడు ప్రభాస్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. యుద్ధ రంగంలో అడుగుపెట్టిన వీరుడిలా ప్రభాస్‌ని పరిచయం చేశారు. జులపాల జుత్తు, ఎవెంజెర్స్ టైపు పర్సనాలిటీతో ప్రభాస్ రంగంలోకి దిగాడు. అయితే.. ఈ లుక్ సైతం ప్రామిసింగ్ గా లేదు. ఎవరితో శరీరానికి ప్రభాస్ తల తీసుకొచ్చి అతికించిన ఫీలింగ్ కలిగింది. దీనిపై కూడా మీమ్స్ మొదలైపోయాయి. నిజానికి… ప్రభాస్ చేస్తున్న మిగిలిన సినిమాల కంటే దీనిపైనే ఎక్కువ బజ్ ఉంది. సలార్ కంటే దీనిపైనే జనాలు నమ్మకాలు పెట్టుకొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ లుక్స్.. ఫ్యాన్స్‌కు ఏమాత్రం కిక్ ఇవ్వలేదు. సరికదా, ఈ సినిమాపై తొలిసారి అనుమానాలు రేకెత్తించేలా తయారయ్యాయి. కేవలం లుక్స్ చూసి సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చేయడం కూడా కరెక్ట్ కాదు. నాగ అశ్విన్ ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. టీజరో.. ట్రైలరో బయటకు వస్తే కానీ మేటరేంటన్నది తెలీదు. కాకపోతే.. ఈ లుక్స్ చూసి మాత్రం ఫ్యాన్స్‌కి నీరసం వచ్చేయడం మాత్రం నిజం.