చిరంజీవి అద్భుతమైన ఎంటర్ టైనర్. చాలా విషయంలో ఆయన ట్రెండ్ సెట్టర్. ఐతే కథల ఎంపికలో మాత్రం ఆయనకంటూ కొన్ని పరిమితులు వుంటాయి. దీనికి కారణం కూడా ఒక రకంగా అభిమానులే. తనను నుంచే ఇలాంటి సినిమాలే అభిమానులు కోరుకుంటున్నారని అదే తరహా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు చిరు. ఐతే ఇప్పుడు సినిమా విషయంలో ప్రేక్షకులు, అభిమానుల అభిరుచులు, అంచనాలు మారిపోయాయి. తమ అభిమాన హీరోని ఒకే ఇమేజ్ చట్రంలో వుంచడం ఇప్పుడు అభిమానులు కూడా ఇష్టపడటం లేదు. స్వయంగా వాళ్ళే వైవిధ్యమైన కథలు కోరుకుంటున్నారు.
కథల విషయంలో చిరంజీవికి మంచి జడ్జ్మెంట్ వుంది. కథలోని మ్యాజిక్ ని పట్టుకోగలరు. ఐతే కథ తయారయ్యే విధానంలో మాత్రం ఆయన చుట్టూ ఇంకా ఓల్డ్ స్కూల్ అఫ్ థాట్ వుందని ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళిన వారి మాట. పరుచూరి బ్రదర్స్, సత్యనంద్ లాంటి స్క్రిప్ట్ డాక్టర్స్ సమక్షంలో చిరంజీవి కథలు తయారౌతుంటాయి. నిజంగా వాళ్ళు చాలా అనుభవం వున్న రచయితలు. కథలో డ్రామాని ఎలా పడించాలనే మెళకువలు తెలిసిన కథాకారులు.
ఐతే ఎవరికైనా ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అది సహజం కూడా. ఓ కొత్త దర్శకుడు న్యూ ఏజ్ కాన్సప్ట్ తో కథని తీసుకెళితే.. అది సదరు స్క్రిప్ట్ డాక్టర్స్ నమ్మే నియమాలకు లోబడి ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది వర్క్ కాదని చెప్పడానికి లేదు. దర్శకుడు వెంకీ కుడుమల చిరంజీవికి ఓ కథ చెప్పారు. అది చిరంజీవి కూడా నచ్చింది. ఐతే కార్యరూపం దాల్చలేదు. చిరు చుట్టూ వుండే స్క్రిప్ట్ డాక్టర్స్ ని అది సంతృప్తి పరచకపోవడం కూడా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళకపోవడానికి ఒక కారణం వినిపించింది.
నిజానికి కథలని అంచనా వేయడంలో చిరుకి మంచి పట్టువుంది. ఐతే ఆ కథని తయారూచేసే క్రమంలో ఆయన మళ్ళీ ఓల్డ్ స్కూల్ అఫ్ థాట్ ని అనుసరించడంతోనే కథలకు మళ్ళీ రొటీన్ కోటింగ్ పడిపోతుంది. అభిమానులు, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దీనికి తగ్గట్టు కథలు తయారుకావాలంటే స్క్రిప్ట్ డాక్టర్స్ విషయంలో కూడా చిరు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిందే.