నందమూరి అభిమానులకు ఇది పండగ రోజు. ఎందుకంటే వాళ్లెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు తిరుపతిలో ఘనంగా జరగబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కానున్నారు. బాలయ్య, క్రిష్, శ్రియ, హేమా మాలినీతో పాటుగా చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనుంది. ఇప్పటికే శాతకర్ణి కోసం తయారు చేయించిన డిజిటల్ ఇన్విటేషన్లు హాట్ టాపిక్‌గా మారాయి. దాదాపు వంద మంది అతిథులకు ఈ ఇన్విటేషన్లు పంపించారు. ఒక్కో ఇన్విటేషన్కీ రూ.8 వేల రూపాయల వరకూ ఖర్చయిందని సమాచారం.
ఈరోజు సాయింత్రం బాలయ్య నిర్ణయించిన ముహూర్తానికి అంటే 7 గంటల50 నిమిషాలకు వేదికపై ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది.అంతకు ముందు బాలయ్య తన హోటెల్ నుంచి సభా వేదికకు భారీ ర్యాలీ మధ్య వెళ్లనున్నాడు. ఈ ర్యాలీలో 500 కార్లు, 1000 బైకులూ, గుర్రపు రథం.. పాలుపంచుకోనున్నాయి. ఆ రథంలో బాలయ్య ఉంటాడన్నమాట. వేదిక దగ్గర వంద అడుగుల ఎత్తులో ఓ ఎల్ ఈ డీ స్ర్కీన్ ఏర్పాటు చేశారు. అతిథులకు మాత్రమే ఆహ్వాన పత్రాలు పంపామని, అభిమానులు ఎంత మందైనా రావొచ్చని చిత్రబృందం ఇప్పటికే క్లారిఫై చేసింది. దాంతో.. అభిమానులంతా తిరుపతి వైపు చూస్తున్నారిప్పుడు. ఆదివారమే తిరుపతి చేరుకొన్న బాలయ్య.. ఇప్పటికే వేంకటేశ్వరుడి సన్నిథిలో పూజలు నిర్వహించి, దర్శనం కూడా జరుపుకొని, బాలాజీ ఆశీస్సులు అందుకొన్నాడు.