వైసీపీలో సీన్ మారుతోంది. చంద్రబాబును పొగిడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆత్మకూరు ఉపఎన్నిక ను బేస్ చేసుకుని చంద్రబాబును పొగడటానికి కొంత మంది రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా చేరారు. జగన్ టిక్కెట్ లేదని తేల్చేసిన ఎమ్మెల్యేల్లో నల్లపురెడ్డి కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ తరపున ఓ మండలానికి ఇంచార్జ్ ఉన్న ఆయన .. ప్రచారంలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఓ విధానం అనుకున్నారని.. దానికి కట్టుబడి ఉన్నారన్నారు.
నిజానికి ఆత్మకూరుపై వైసీపీ విధానం వేరుగా ఉంది. టీడీపీ పారిపోయిందని విమర్శించడం వైసీపీ విధానం. ఆ ప్రకారం ఎవరో ఒకరు ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డికి తెలియకుండా ఉండదని చెప్పలేం. ఎందుకంటే ఆయన చంద్రబాబుపై దూషణలు చేయడంలో ముందుంటారు. కొడాలి నాని, వంశీ తర్వాత ప్లేస్ ఆయనకే ఉంటుంది. అయినా చంద్రబాబును పొగడటానికి ఆసక్తి చూపించారు. నల్లపురెడ్డి టీడీపీ నేత. టీడీపీ తరపున గెలిచి వైఎస్ ఆకర్ష్‌లో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత వైసీపీకి మారారు.
నల్లపురెడ్డి వ్యాఖ్యలను వెంటనే డిప్యూటీ సీఎం ఖండించారు. నల్లపురెడ్డి ముందే చంద్రబాబు ఏ మాత్రం మేలు చేయలేదని తేల్చేశారు. నిజానికి చంద్రబాబుకు ధ్యాంక్స్ చెప్పాలని ఏ ఒక్క వైసీపీ నేత కూడా ఊహించే పరిస్థితి ఉండదు. అలాంటి అలవాటు వైసీపీలో ఉండదు. కానీ నల్లపురెడ్డి చెప్పడమే కాదు.. ఇలాంటి వాళ్లు పెరుగుతున్నారంటే.. ఏదో కొంచెం ఆలోచించాల్సిన విషయమేనన్న చర్చ నెల్లూరు జిల్లాలో జరుగుతోంది.