అప్పుడప్పుడూ స్టార్ హీరోలు అభిమానులతో మీటింగ్ పెట్టడం మామూలే. సాధారణంగా సినిమా విడుదలకు ముందు.. వాళ్లని పిలిచి, ముచ్చట్లు జరిపి పంపిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ కాస్త ముందుగానే మేల్కొన్నట్టు తెలుస్తోంది. అభిమానుల్ని ముందస్తుగా పిలిచి.. వాళ్లతో మాట్లాడి, ఫొటోలు దిగి మరీ వాళ్లను సంతృప్తి పరుస్తున్నాడు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియోలో జరుగుతోంది. ఈ సెట్‌కి తన అభిమానుల్ని ఆహ్వానించాడు ఎన్టీఆర్. సోమ, మంగళ వారాలు కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల నుంచి అభిమానులు వచ్చారు. వాళ్లతో ఎన్టీఆర్ కాసేపు సరదాగా గడిపాడు. వాళ్లతో ఫొటోలు దిగాడు.
ఈ సినిమా కోసం సారధిలో ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. దాని విలువ దాదాపుగా రూ.2 కోట్లపైమాటే. ఆ సెట్లో సన్నివేశాలు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అందుకే.. అభిమానుల్ని ఆ సెట్లోనే కలుసుకోవాలనుకొన్నాడట. వెంటనే అభిమానులకు ఆహ్వానాలు అందిపోయాయి. ‘ఇక నుంచి రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం..’ అని అభిమానులకు మాటిచ్చాడట బాద్ షా. ఈ మీటింగ్ వెనుక రీజన్ ఇదేనా, లేదంటే వేరే రాజకీయ పరమైన కారణాలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం.. కేవలం సినిమా విశేషాలు మాత్రమే ముచ్చటించి పంపినట్టు భోగట్టా.