స్క్రీన్ పై కథని చూస్తున్నపుడు నవ్వాల్సిన చోట నవ్వి, కన్నీళ్లు పెట్టుకునే చోట కన్నీళ్లు తిరగడం మంచి సినిమా లక్షణం. ఇలా జరిగినప్పుడే నటులు తమ పాత్రలకు న్యాయం చేసినట్లు, దర్శకుడు తను అనుకున్నది సరిగ్గా ప్రజంట్ చేసినట్లు. అలా కాకుండా కన్నీళ్లు పెట్టుకునే చోట పగలబడి నవ్వి, నవ్వాల్సిన చోట తలలు పట్టుకుంటే అది ఖచ్చితంగా బ్యాడ్ మూవీ. ఇలా మిస్ ఫైర్ అవ్వడానికి చాలా కారణాలు వుంటాయి. తాజాగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ లో చాలా మిస్ ఫైర్లు వున్నాయి. అందులో ఒక మిస్ ఫైర్ .. పవిత్ర లోకేష్, నరేష్ కాస్టింగ్. వీరిద్దరూ స్క్రీన్ పై కనిపించినపుడల్లా థియేటర్లో అరుపులు వినిపించాయి. అయితే ఈ అరుపులు ఆనందంతో వినిపించినవి కాదు.. ఆ అరుపుల్లో వెక్కిరింత వుంది.
దీనికి కారణం ఈ మధ్య వెలుగు చూసిన పవిత్ర లోకేష్, నరేష్ ల వ్యక్తిగత జీవితం. సెలబ్రిటీలు, నటుల వ్యక్తగత జీవితం వారి వృత్తిపై కూడా ప్రభావం చూపుతుందనడానికి ప్రత్యేక్ష సాక్ష్యంగా నిలిచింది రామారావు ఆన్ డ్యూటీ. ప్రేక్షకుల వెక్కిరింత ఏ స్థాయిలో ఉందంటే.. భర్త నాజర్ చనిపోయాడని ఏడుస్తుంటుంది పవిత్ర. ఆ ఏడుపుని కూడా వెక్కిరించి గొళ్ళున నవ్వారు జనం. సీరియస్ సీన్ కూడా నవ్వులాటైపోయింది.
ఒక పాత్ర అనుకున్నపుడు ఆ పాత్ర తగ్గ ఇమేజ్ వున్న నటులు కోసం అన్వేషిస్తారు దర్శక నిర్మాతలు. నిజానికి ఆ పాత్ర పవిత్రకు సరిపోయేదే. అలాంటి పాత్రలు ఇది వరకూ చాలా చేశారావిడ. కానీ ఇప్పుడు వేరు. నరేష్ -పవిత్ర లకు ఒక సెపరేట్ ఇమేజ్ ఏర్పడింది. నిజానికి రామారావు ఆన్ డ్యూటీ చాలా రోజుల క్రితమే మొదలైయింది. అప్పటికి ఈ ఇమేజ్ మార్పు లేదు. కానీ ఇప్పుడు పవిత్ర – నరేష్ తెరపై కనిపిస్తుంటే జనం గోల పెడుతున్నారు. దీని బట్టి ఇకపై ఎలాంటి పాత్రలకు వారిని తీసుకోవాలో దర్శక నిర్మాతలు జాగ్రత్త వహిస్తే మంచిది. లేదంటే.. రామారావు లానే అంతా నవ్వులాటైపోతుంది.