ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో కోహ్లీ ఒకడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డులన్నీ బద్దలు కొట్టగల సామర్థ్యం తనకు మాత్రమే ఉందన్నది క్రికెట్ అభిమానుల నమ్మకం కూడా. అయితే… కోహ్లీ కెప్టెన్సీపై తన అభిమానులు కూడా అసంతృప్తితోనే ఉంటారు. ధోనీలా కూల్‌గా ఉండలేడని, తన ఎత్తుగడలన్నీ పేలవంగా ఉంటాయని, జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో కోహ్లీ తేలిపోతుంటాడన్నది అందరి వాదన. పైగా తాజా ఐపీఎల్ ప్రదర్శనతో ఈ వాదనకు మరింత బలం వచ్చింది. బెంగళూరు జట్టుకి ఒక్కసారి కూడా ఐపీఎల్ అందించని కోహ్లీ.. అసలు నాయకుడిగా అనర్హుడు అంటూనే ఘాటైన కామెంట్లు చేశారు.
ఇప్పుడు ఆసీస్ పర్యటనలోనూ.. కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు విస్మయ పరుస్తున్నాయి. తొలి రెండు వన్డేల్లోనూ.. భారత్ ఘోరంగా ఓడిపోయింది. జట్టు కూర్పు సంగతి అటుంచితే.. మైదానంలో కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు, బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ మోహరింపు కూడా… విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా రెండో వన్డేలో బుమ్రాతో తొలి స్పెల్ లో రెండే ఓవర్లు వేయించడం కొంతమంది మాజీలకు నచ్చలేదు. ఆదివారం ఆసీస్ తో జరిగిన మ్యాచ్‌లో.. తొలి స్పెల్ లో బుమ్రాని రెండే ఓవర్లకు పరిమితం చేశాడు కోహ్లీ. అసలే ఆసీస్ ఓపెనర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాంటప్పుడు బుమ్రాతో వీలైనన్ని ఓవర్లు వేయించాలి. అలా కాకుండా… షైనీని రంగంలోకి దించాడు. షైనీపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు. ధారాళంగా పరుగులు పిండుకున్నారు. దాంతో.. ఆసీస్ బ్యాటింగ్ నల్లేరుపై నడకలా మారిపోయింది. వరుసగా రెండో వన్డేలోనూ భారీ స్కోరు సాధించింది.
ప్రపంచ అత్యత్తమ బౌలర్‌కి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశాన్ని రెండు ఓవర్లకే కుదించడం… మాజీలకు నచ్చలేదు. గౌతమ్ గంభీర్ కోహ్లీ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అసలు దీన్ని కెప్టెన్సీ అంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ మోహరింపు దారుణంగా ఉన్నాయని, బౌలింగ్ కూడా చేయగల ఓ బ్యాట్స్‌మెన్ ని తుది జాబితాలో ఉండేలా చూసుకోకపోవడం కోహ్లీ చేసిన పెద్ద పొరపాటని, అందుకే షైనీలాంటి ఓ బౌలర్ విఫలం అయినా.. అతన్ని కొనసాగించడం తప్ప మరో మార్గం లేకుండా పోతోందని, అలా.. ప్రత్యర్థికి భారీ పరుగులు కట్టబెట్టాల్సివస్తోందని, కేవలం కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యం వల్లే తొలి రెండు వన్డేలూ ఓడిపోయామని… గంభీర్ చెబుతున్నాడు. ఐపీఎల్ లో అత్యుత్తమంగా రాణించిన నటరాజన్ కి వన్డేజట్టులోనూ స్థానం కల్పించాల్సిందని, తన బౌలింగ్ షైనీ కంటే మెరుగ్గా ఉందని ఇంకొంతమంది మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు.
పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మని కెప్టెన్ చేయాలన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. రోహిత్ కెప్టెన్ గా అర్హుడు కూడా. కోహ్లీ తాజా వైఫల్యంతో రోహిత్ మద్దతు దారుల గొంతు మరింత గట్టిగా వినిపిస్తోంది. ఇదంతా… కెప్టెన్ గానే కాదు, ఓ బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీపై ఒత్తిడి పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాబోయే మ్యాచ్‌లు కోహ్లీకి కఠిన పరీక్షలే!