మీ హీరో కోసం మీరు సమయాన్ని వృధా చేస్తూంటే మీరెప్పుడు బాగుపడతారు? .. అని తమిళ హీరో అజిత్ కుమార్ ఓ మీడియా ఇంటర్యూలో చెప్పిన మాట వైరల్ గా మారుతోంది. బయట, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్యాన్ వార్స్.. మా హీరో సినిమా సంక్రాంతి విన్నర్ అని అదే పనిగా వాదనలు. ఏ సినిమా విన్నర్ అయినా ఈ వాదనలకు దిగే వారికి ప్రయోజనం ఏమిటి ?. డబ్బులు వచ్చినా.. పోయినా సినిమా వారిది. అభిమానులకేం రాదు. మరి ఎందుకు బట్టలు చించేసుకుంటున్నారు ?.
హీరోలు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు – మరి మీ పనేంటి ఫ్యాన్స్ ?
సినిమా హీరోలు .. కేవలం వారి పని వారు చేసుకుంటున్నారు. దాని వల్ల వారికి డబ్బులు వస్తాయి. అది వారి పని. మరి ఫ్యాన్స్ పనేమిటి?. ఆ హీరోల సినిమాలు చూసి.. ఆ హీరోల గురించి మాట్లాడుతూ.. మా హీరో గొప్ప అని చెప్పుకోవడం ఫ్యాన్స్ పనా ?. అలా చేసి జీవితాలను నాశనం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?. ప్రతి ఒక్కడూ తమ తమ జీవితంలో హీరో. తాము చేసే పనిలో ముందుకెళ్లడం హీరోయిజం. అంతే కానీ.. ఎవరికో వర్షిప్ చేయడం హీరోయిజం కాదు. సినిమా అనేది ఓ వ్యసనంగా మార్చుకుని… చదువుల్ని, వ్యాపారాల్ని పోగొట్టుకున్నవారు లూజర్స్. వారి వల్ల ఈ సమాజానికి.. వారి కుటుంబానికి ప్రయోజనం ఏమి ఉంటుంది ?
ఫ్యాన్ వార్స్ సరే – మీరెప్పుడు బాగుపడతారు?
హీరోలు ఎందుకు మా ఫ్యాన్స్ గొప్ప అంటారంటే… వారికి వచ్చే రెమ్యూనరేషన్స్ వారి ఓపెనింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఓ హీరో సినిమాకు వంద కోట్ల ఓపెనింగ్స్ వస్తే దానికి తగ్గ రెమ్యూనరేషన్ హీరో వసూలు చేస్తాడు. రేట్లు పెంచుకుంటాడు. ఫ్యాన్స్ దగ్గరే ఎక్కువ వసూలు చేస్తారు. తొలి షోలు చూసేది ఫ్యాన్సే అని తెలిసి కూడా ఎందుకు భారీగా రేట్లు పెంచుతున్నారు?. అది వారి ఆదాయం కోసం చేస్తున్నారు కాబట్టి. మరి అలా ఆ సినిమా తొలి రోజుల్లోనే చూడకపోతే ఫ్యాన్‌కు వచ్చే నష్టం ఏమిటి ?. ఏమీ ఉండదు. కాస్తంత డబ్బులు మిగులుతాయి.. సమయం మిగులుతుంది ?
మీ జీవితానికి మీరే హీరోలు – గుర్తించినప్పుడే బాగుపడేది !
సినిమా హీరోలే కాదు..రాజకీయ నాయకులు.. పార్టీలకు ఊడిగం చేసే వారికీ ఇది వర్తిస్తుంది. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల కోసం అదే పనిగా ఊడిగం చేసే కొంత మంది .. తాము పార్టీకి ఎంతో చేశాం.. మాకు ఏం చేయడం లేదని వాపోతూ ఉంటారు. ఎవరూ వచ్చి ఏమీ చేయరు. నీకు చేతనైతే చేయించుకోవాలి లేకపోతే.. చేతనైన పని చేసుకోవాలి. అంతే కానీ అేభిమానించాం.. మా జీవితం సంకనాకిపోయిందంటే..ఎవరు బాధ్యలు ?. నీదే బాధ్యత…నీ ప్రతి కష్టనష్టానికి.. నీదే బాధ్యత. ఎప్పుడైతే నీకు నువ్వు హీరోగా ఉంటావో… ప్రతి పని నీకు..నీ కుటుంబానికి మేలు చేసేలా చేస్తావో అప్పుడే దారిలో ఉన్నట్లు. ముందుగా హీరోలను.. రాజకీయనేతలను పిచ్చిగా అభిమానించడం మానేసి.. కేవలం స్ఫూర్తిగా తీసుకుని వృద్ది చెందడానికి పరుగులు పెట్టు. అప్పుడే బాగుపడతావు. ఇది అందరి ఫ్యాన్స్‌కు వర్తిస్తుంది.