హైదరాబాద్: ఈ నెల ఆరో తేదీన వరంగల్ జిల్లా శాయంపేటలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన రైతు కొమురయ్యపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ బ్యానర్ కథనాన్ని వెలువరించింది. పత్తికి మద్దతు ధర లభించకపోవటంతో ఆక్రోశంతో వ్యవహరించినందుకు కక్ష కట్టి ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టారని, అతను పదిరోజులుగా జైల్లోనే మగ్గుతున్నాడని ఆరోపించింది. వాస్తవానికి అతను టీఆర్ఎస్ కార్యకర్తేనని, ప్రశ్నించటం అతని నైజమని, గతంలో వైఎసఅర్ను, హరీష్ రావును కూడా నిలదీశాడని రాసింది. అరెస్టును ఖండించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు మళ్ళీ అతనిని పట్టించుకోలేదని ఆరోపించింది. బెయిల్ బాధ్యత తమదేనని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కొమురయ్య కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారని, అయితే మళ్ళీ పట్టించుకోలేదని రాసింది. ప్రభుత్వానికి భయపడి బెయిల్‌కు ష్యూరిటీ ఇవ్వటానికి ఎవరూ రావటంలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. జైల్లో కొమురయ్యను పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టారని, అతను జ్వరంతో బాధపడుతున్నాడని, పోలీసుల దెబ్బలకు నడవలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు కథనంలో రాశారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, వీహెచ్ ఇవాళ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందిచో, ఏమో – వరంగల్ జైల్లో ఉన్న కొమురయ్యను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కొమురయ్యపై తప్పుడు సెక్షన్లు పెట్టారని ఆరోపించారు. అతనిపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధించటం అన్యాయమని, తమ పార్టీ అతనికి అండగా నిలబడుతుందని, అతనిని విడుదల చేసేవరకు పోరాడతామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని వీహెచ్ అన్నారు.