లగచర్ల ఇష్యూని ఇంకా ఇంకా లాగడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కొత్త కొత్త డ్రామాలు వెలుగుచూడటం సంచలనంగా మారింది. లగచర్ల రైతుకు గుండెపోటు వచ్చిందని ఆయనప్పటికీ ఆయనకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారని వార్త సంచలనం అయింది. బీఆర్ఎస్ ఇలా వార్త రాగానే అలా హంగామా చేసింది. కేటీఆర్ ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. రైతుకు గుండెపోటు వస్తే అంబులెన్స్ లో తీసుకెళ్తారు కానీ ఇలా తీసుకెళ్లడం ఏమిటని చాలా మందికి డౌట్ వచ్చింది. రేవంత్ కూడా ఏం చేస్తున్నారని పోలీసు, జైలు అధికారులపై మండిపడ్డారు. దాంతో అసలేం జరిగిందో బయటకు తీశారు.
లగచర్ల దాడి కేసులో నిందితుడు హీర్యానాయక్. కానీ ఆయన బాలానగర్ కేసులో నిందితుడు అని చూపించి.. ఆస్పత్రికి అనుమతి కోసం సైబరాబాద్ సీపీకి సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు లేఖ రాశారు. అనుమతి తెచ్చుకుని బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంతకీ ఆయనకు గుండెపోటు వచ్చిందా అంటే.. అదీ కూడా కథేనని చెబుతున్నారు. అంటే అనారోగ్యం లేదు.. తీసుకోవాల్సిన వారి దగ్గర అనుమతి తీసుకోలేదు.. తీసుకెళ్లాల్సిన పద్దతిలో తీసుకెళ్లలేదు. ఇదంతా రాజకీయం చేసిన ప్లాన్ లా ఉందని తేలిపోయింది.
దీంతో ప్రభుత్వం అప్పటికప్పుడు సంగారెడ్డి జైలు జైలర్, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. అధికారులు ఇలా బేడీల సీన్ కోసమే ఇదంతా క్రియేట్ చేశారని.. లగచర్ల రైతు ఇష్యూతో రోజుకో రచ్చ చేయడానికి కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వం మండిపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో భాగం కావడంతో సహించేది లేదని స్పష్టత ఇచ్చింది. అయితే ఈ ఘటన ప్రభుత్వ అధికారుల్లో ప్రభుత్వంపై కనీస భయం లేదనడానికి నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు.