విశాఖలో ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్కు పరిస్థితులు కలసి రావడం లేదు. పేదల ఇళ్ల కోసమంటూ… పేదలు సాగు చేసుకుంటున్న 6,116 ఎకరాల భూమిని పూలింగ్ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులుగా అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము ఇచ్చేది లేదని..రైతులు తేల్చి చెబుతున్నారు. అధికారులు నయానో..భయానో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా… భూములిస్తే… మళ్లీ తమను ప్రభుత్వం మోసం చేస్తుందేమోనన్న ఆందోళనలో చాలా మంది ఉన్నారు.
ఈ భూములన్నీ.. గతంలో పేదలకు ప్రభుత్వాలు ఇచ్చినవే కావడంతో..అధికారులు… ఎలాగైనా తీసుకుంటామని రైతులను భయపెడుతున్నారు. డి ఫారం భూముల సాగుదార్లకు ఎలాంటి హక్కులుండవని, ఆ భూములు ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకోవచ్చని అధికారులు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో భూములు ఇవ్వడానికి కొంత మంది రైతులు ముందుకు వస్తున్నారు. కానీ వారు ప్రభుత్వం కంటే తెలివిగా ప్రతిపాదన పెడుతున్నారు. పూలింగ్ వద్దు కానీ… 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చి మొత్తం భూముల్ని తీసుకోమంటున్నారు. అలా ఇవ్వాలంటే… ఎకరానికి రెండు నుంచి మూడు కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
ల్యాండ్ పూలింగ్పై రైతులు నమ్మకం పెట్టుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇస్తామంటున్న భూమి ఉపయోగపడదు. ఎందుకంటే.. సమీకరిస్తున్న భూములన్నీ ఒకే దగ్గర లేవు, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. సుమారు 400 నుంచి 500 ఎకరాలు ఒక్క దగ్గర ఉంటే అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్ ఒక్కో చోట ఇరవై, ముప్పై ఎకరాలు మాత్రమే ఉంటుంది. అందుకే.. అలాంటి చోట్ల ఇచ్చే.. ప్లాట్లతో తామేం చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏ విషయంలోనూ.. క్లారిటీగా లేకపోవడంతో… ల్యాండ్ పూలింగ్ సక్సెస్ కావడం లేదు. దీనిపై ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తుందో మరి..!