ఆంధ్రప్రదేశ్లో ధాన్యం రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి నెలల తరబడి నిధులు రావడం లేదు. అధికారిక కార్యక్రమాల్లో నేతల్ని నిలదీస్తున్నారు. ప్రజా ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రావడం లేదు. దీంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలేం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. మద్దతు ధరకు ధాన్యం సేకరణ ప్రతీ రాష్ట్రం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ అన్ని రాష్ట్రాలు రైతులకు డబ్బులు వెంటనే చెల్లిస్తున్నాయి. కానీ రాష్ట్రం మాత్రం చెల్లించడం లేదు. అక్కడే తేడా వస్తోంది.
ఆరుగాలం శ్రమించిన పంట తీసుకున్న ప్రభుత్వం..! కానీ డబ్బులేవి..?
రబీ సీజన్లో రైతులు పండించిన వాటిలో 35 లక్షల టన్నులకుపైగా ధాన్యాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం మొత్తం విలువ దాదాపుగా రూ. 6, 600 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకూ రైతులకు రూ.3200కోట్లు చెల్లింపులు మాత్రమే జరిగాయి. మిగతా సొమ్ము పెండింగ్లో ఉంది. ఒక వారం.. రెండు వారాలు కాదు.. నెలల తరబడి ఈ సొమ్ము చెల్లింపుల వరకూ రావడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు పడుతున్నాయి. రైతులకు పెట్టుబడులకు నగదు అవసరం. పండించిన పంటను ప్రభుత్వం తీసుకున్నా… డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో.. ఆ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడుల కోసమైనా డబ్బులు కావాలి కదా.. అని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
48గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేసిన గత ప్రభుత్వం..!
గత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ ఎప్పుడూ చెల్లింపుల సమస్య రాలేదు. ధాన్యాన్ని రైతు వద్ద నుంచి కొనుగోలు చేసిన 48గంటల్లో .. ఆ రైతు ఖాతాకు నిధులు చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దాని ప్రకారం చెల్లింపులు చేసేది. అయితే బ్యాంకుల సమస్యలు.. ఇతర టెక్నికల్ సమస్యల వల్ల .. కొంత మందికి రెండు, మూడురోజులు ఆలస్యమయ్యేది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. రైతుల్ని వేధిస్తున్నారని విరుచుకుపడేవారు. తాము వస్తే ఇంకా పర్ఫెక్ట్గా నిధులు జమ చేస్తామన్నట్లుగా వారు మాట్లాడేవారు.
21 రోజులకు గడువు పెంచిన వైసీపీ సర్కార్.. కానీ చెల్లింపులు మాత్రం లేవు..!
తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొదట 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని వారానికి పెంచింది. వారంలో చెల్లింపులు సాధ్యం కావడం లేదని 21రోజుల్లో చెల్లిస్తామని మార్చారు. ఇప్పుడు ఆ సమయానికీ ఇవ్వడం లేదు. రెండు నెలలు అవుతున్నా.. చాల మంది రైతులకు తమ కష్టానికి తగ్గ రొక్కాన్ని కళ్ల జూడలేకపోయారు. మళ్లీ పంటలు వేయాల్సిన సమయం రావడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులవైపు చూడాల్సి వస్తోంది. ధాన్యం సొమ్ముకు ప్రభుత్వం వడ్డీ ఎలాగూ ఇవ్వదు..కానీ రైతులు మాత్రం.. ఆ డబ్బులు అందనందుకు.. ఐదు రూపాయల వరకూ వడ్డీకి తెచ్చుకుని పంటలు వేయాల్సి వస్తోంది.
కేంద్రం ఇచ్చినా రాష్ట్రం విడుదల చేయడం లేదా..?
బియ్యం సేకరించడానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించదు. కేంద్రమే భరిస్తుంది. అయితే కేంద్రానికి ఇవ్వాల్సిన పత్రాలన్నీ సరిగ్గా సమర్పిస్తే వెంటనే విడుదలవుతాయి. రైతులు ఇబ్బంది పడుకుండా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. కేంద్రం నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు సర్దుబాటు చేసుకునేది. కానీ ప్రస్తుతం.. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు.. ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా రైతుల ఆందోళనలను తీర్చేందుకు అసలేం జరుగుతుందో ప్రభుత్వం మాత్రం చెప్పడం లేదు.