“ప్రజల కోసం.. ప్రజల చేత” నడపబడేదే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మనం చెప్పుకుంటూ ఉంటారు. రాజ్యాంగంలోనూ అదే రాశారు. కానీ వాస్తవంగా దేశంలో జరుగుతోంది అదేనా..?. ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటున్నారు కాబట్టి.. ప్రజల చేత నడుస్తున్న ప్రభుత్వంగానే భావించాలి. కానీ ప్రజల కోసం నడుస్తున్నట్లుగా ఎలా భావించాలి..? ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు.. ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నా… ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. ఆందోళనలపై ఉక్కుపాదం మోపి..కేసులు, దర్యాప్తుల భయం పెట్టి ప్రజల్ని నోరు తెరవకుండా చేసి.. తాము అనుకున్నది చేసే పాలకులు .. నిజంగానే ప్రజల కోసం ప్రభుత్వాలు నడుస్తున్నట్లుగా చేస్తున్నారా..? రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయా…?
రైతుల గోడు వినేత తీరికే లేని కేంద్రం..!
ఢిల్లీ చుట్టూ రైతుల ఆందోళనలు మార్మోగిపోతున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు రద్దు చేయాలో.. ఆ చట్టాలు తమను ఎలా కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా చేస్తాయో వారు వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఆ చట్టాలు రైతుల మేలు కోసమేనని చెబుతోంది. చట్టాల ఉపసంహరణ ప్రశ్నే లేదని అంటోంది. ఇక్కడే రైతులు- ప్రభుత్వం మధ్య పీట ముడి పడిపోయింది. కేంద్రం తెచ్చిన చట్టాల్లో కార్పొరేట్ కంపెనీలకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ రైతులకు ఏమున్నాయో చెప్పడం కష్టం . ఎప్పుడైనా ఒప్పందాల నుంచి వెదొలగవచ్చు.. లేకపోతే.. ఏం జరిగినా సరే భూమి మీద హక్కులు మాత్రం కార్పొరేట్ కంపెనీకి పోవు లాంటి హక్కులు ున్నాయి. అసలు భూమిపై సాగులో అయినా పంటలో ఒకశాతం హక్కులైనా కార్పొేట్ కంపెనీకి పోతే… అది రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ చట్టాల్లో రైతులకు రక్షణ కల్పించేవే లేవు. అనేక రక్షణలు కల్పించినట్లుగా… కావాలంటే కోర్టుకెళ్లొచ్చని ప్రభుత్వం చెబుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… ఈ దేశంలో న్యాయం అందరికీ సమంగా అందుతుందన్న నమ్మకం మాత్రం ప్రజలకు కలగలేదు.కోర్టులో పడితే.. అది తేలదని చాలా మంది నమ్ముతారు. కోర్టుల్లో లక్షల సంఖ్యలో ఉన్న పెండింగ్ కేసులే నిదర్శనం. రైతులు కార్పొరేట్ కంపెనీలను ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టూ తిరగగలరా..?. చాన్సే లేదు.
సరుకు ఎక్కడైనా అమ్ముకోవచ్చనేది అందమైన అబద్దం..!
చట్టాల్లో రైతుల మంచి కోసం పెట్టామంటూ చెబుతున్న మరో టాపిక్.. ఎక్కడైనా అమ్ముకోవడం. అలాగే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్మగలరా..? ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం ఎవరైనా తమ రాష్ట్రానికి సరుకుతీసుకు వచ్చి అమ్మితే జైల్లో వేస్తామని ప్రకటించారు. దేశం అంతా ఒకటే కావొచ్చు కానీ రాష్ట్రాలు వేర్వేరు. రాష్ట్రాలన్నీ తమ తమ ప్రజల ప్రయోజనాలు కాపాజటానికి ఎంతకైనా తెగిస్తాయి. అందులో సందేహం లేదు. అలాంటిది.,.. తెలంగాణ రైతు.. ఏ రాజస్తాన్‌లోనో పంట అమ్ముకునేందుకు చట్టం చేస్తే సరిపోతుందా..? అక్కడ ప్రభుత్వాలు ఊరుకుంటాయా..?. చట్ట విరుద్ధంగా అయినా సరే వారిని అడ్డుకోరా..?. ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లి అమ్ముకోవడం అనేది అసాధ్యమైన విషయం. ఆ విషయం తెలియక కాదు. కానీ.., రైతులకు ఎంతో మేలు చేశామని చెప్పుకోవడానికే.. చట్టంలో ఈ క్లాజ్ ఉంది. వాస్తవానికి ఇది రైతుల వద్ద బల్క్‌గా కొనో… ఒప్పందాలు చేసుకునో… లారీల కొద్దీ.. ఒక చోట నుంచి మరో చోటకి తరలించే కార్పొరేట్లకే లాభం కలిగిస్తుంది.
రైతులు అడుగుతోంది మద్దతుధరకు చట్టబద్ధత..! అదివ్వలేరా..?
రైతులు చట్టాల రద్దు డిమాండ్ చేస్తున్నప్పటికీ. .ప్రధానంగా ఒక డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. అదే .. మద్దతుధరకు చట్టబద్ధత. రైతుల్లో అనుమానాలు ప్రారంభం కావడానికి తమను అంబానీకి.. అదానీకి కట్ట బెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం… మద్దతు ధర. ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలిగి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేస్తోందని.. అందుకే మద్దతు ధర విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంలో రైతులు ఉన్నారు. అందుకే వారు కోరుతోంది ఒక్కటే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. ఆ బిల్లులోకార్పొరేట్ కంపెనీల కోసం ఎన్నెన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ మద్దతు ధరకు మాత్రం చట్టబద్ధత లేదు. ఏ కంపెనీ అయినా.. రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేయవచ్చు… కానీ. మద్ధతు ధరకే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టాలి ఇప్పటికే దళారులు సిండికేట్ అయితే రైతులు ఎంత నష్టపోతున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త చట్టాల వల్ల దళారుల స్థానంలో కార్పొరేట్లు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే.. రైతుల డిమాండ్లు పరిష్కరించాలి.
సంస్కరణలు వద్దనడం లేదు.. కార్పొరేట్‌కు కట్టబెట్టవద్దంటున్నారు..!
రైతు బతుకును బాగు చేయడానికి.. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు సాగుతున్నాయి. బాధ్యతలు చేపట్టే ప్రతీ ప్రభుత్వం తమది రైతు ఎజెంజా అని చెబుతూంటాయి. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటిస్తూ ఉంటాయి. కానీ.. ఎక్కడా కూడా… రైతు కోణంలో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉండవు., అలా ఉంటే… ఒక్కో సీజన్లో ఉల్లి ధర వంద కు వెళ్లి .. మళ్లీ కొన్ని రోజులకే పది రూపాయలకు పడిపోయే పరిస్థితి లేదు. క్రమబద్ధంగా డిమాండ్, సప్లయ్ ని నిర్వహించలేని విధానాలు ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఏల్లు గడుస్తున్నా… అందులో మార్పురావడం లేదు. ఈ చిన్న విషయంలోనే ప్రభుత్వాలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తే..ఇక సంస్కరణల విషయంలో ఎలా ఉంటాయి..?. రైతు సంస్కరణలను అందరూ సమర్థిస్తున్నారు. కానీ.. అందరూ.. తమను కార్పొరేట్‌కు కట్టబెట్టవద్దని కోరుతున్నారు.
అణిచివేయడం ప్రజాస్వామ్య లక్షణం కాదు..!
ప్రజల ఆందోళలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. వారు మాకు ఓట్లేశారా లేదా.. అని విభజించుకుని చూసి.. లెక్కలోకి తీసుకోవాలో వద్దో పరిగణించడం.. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమే. ప్రభుత్వాలు ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలి. తమకు ఓట్లేసిన వారికే కాదు. తమకు ఓట్లేసిన వారికే మేలు చేస్తామంటే.. ఓట్లేయని వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం… తప్పే. అంతే ఆందోళలను అణచి వేయడానికి ప్రయత్నించడం… ఆ చట్టాలకు మెజార్టీ రైతులు ఆమోదిస్తున్నారని మీడియా సర్వేల పేరుతో ప్రచారం చేసుకోవడం… వారి వాయిస్ వినబడకుండా సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయించడం.. వారికి అన్నపానీయాలు అందకుండా అడ్డుకోవడం.. లాంటివన్నీ నిరంకుశత్వానికి సాక్ష్యాలే. ప్రాజస్వామ్యంలో ఇవి తప్పుడు విధానాలు.
ఎక్కడైనా రైతు బాగుపడాలి అని పాలకులు ప్రకటిస్తారు. కానీ బాగుపడే నిర్ణయాలు తీసుకుంటే… వారిని వ్యాపారుల కేటగిరిలోకి మార్చి నిందలు వేస్తారు. పంజాబ్ నుంచి ఆంధ్ర వరకు జరుగుతోంది అదే. ప్రజల్ని విభజించి స్వార్థ రాజకీయాలు చేసుకోవడానికి అధికారాన్ని ఆలంబనగా చేసుకుంటున్నారు. అక్కడే సమస్య వస్తోంది. అందుకే అంటారు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని.