ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించింది. గురువారం సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల డబ్బులు జమ కానున్నాయి.
మొదటగా లక్ష వరకు ఉన్న రుణమాఫీ పూర్తచేయనున్నారు. లక్షకు పైగా ఉన్న రుణమాఫీని ఆగస్టు 15వరకు పూర్తిచేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రుణమాఫీ మొదలైన ఈనెల 18న… లబ్ధిదారులతో అన్ని జిల్లాల్లో సంబరాలు చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పాల్గొంటారని పేర్కొంది.
ఇక రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
మరోవైపు రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్ బుక్ ల ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ వర్తింపు జరుగుతుందని… కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుంటామన్నారు. ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ పేర్లపై అప్పు తీసుకొని ఉంటే ముందుగా మహిళలపై ఉన్న రుణమాఫీ చేస్తారు. కుటంబంలో ఎంత మంది ఉన్నా, అప్పు ఎంత ఉన్నా… గరిష్టంగా 2లక్షల వరకు మాఫీ అవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.