టీవీ9పై దాడి కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రైతులకు హత్యాయత్నం కేసులు పెట్టడం.. వివాదాస్పదమవుతోంది. ఈ కేసులు పెట్టి.. కోర్టులో హాజరు పరచడంతో.. న్యాయమూర్తి.. ఆధారాలు అడిగారు. హత్యాయత్నం చేశారనడానికి ఆధారాలేవని.. మారణాయుధాలేవని ప్రశ్నించడంతో.. పోలీసులు కోర్టులో నీళ్లు నమలాల్సి వచ్చింది. రైతులపై పెట్టిన సెక్షన్లు సరి కాదని..న్యాయమూర్తి అనడంతో.. పోలీసులు వెంటనే.. బెయిలబుల్ సెక్షన్ 373 కింద కేసును మార్చేశారు. ఇది బెయిలబుల్ సెక్షన్. రైతులపై హత్యయత్నం కేసులు పెట్టడం.. అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం.. ఆందోళనలు చేస్తున్న రైతుల్ని.. వారికి మద్దతిస్తున్న వారిని మరింతగా రెచ్చగొట్టినట్లయింది.
రైతుల్ని ఉంచిన గుంటూరు జిల్లా జైలుకు నేతలు పోటెత్తారు. టీడీపీ నేతలు ఉదయమే పరామర్శించి.. ధైర్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. జిల్లా జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానికి పోలీసులు కొంత మంది ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా.. వ్యవహరిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఏమిటన్న చర్చ న్యాయవర్గాల్లోన ేనడిచింది. ఎవరి దగ్గరా మారణాయుధాలు లేవు. ఎవరూ కావాలని దాడి చేయలేదు. అక్కడున్నవారిని కించ పర్చడంతోనే దాడి జరిగింది. రైతులకు బెయిల్ రాకుండా చేసి.. ఇతర రైతులను కూడా ఆందోళనల్లో పాల్గొనకుండా చేసే ఉద్దేశంతో.. అర్థరాత్రి గ్రామాల్లో పోలీసులు అలజడి సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇళ్లలో గోడలు దూకి మరీ.. మీడియాపై దాడికి పాల్పడ్డారంటూ.. కొంత మందిని పోలీసులు అర్థరాత్రి పూట తీసుకెళ్లారు. ఇది రైతులలో మరింత ఆగ్రహానికి కారణం అయింది. విభజన తర్వాత రాజధాని లేకుండా పోయిన రాష్ట్రానికి రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇవ్వడమే రైతులు చేసిన తప్పా.. అన్న రాజకీయ పార్టీలు ప్రశ్నించడం ప్రారంభించాయి. రైతులపై హత్యాయత్నం కేసులు… ప్రభుత్వ తీరు… మరింత వివాదాస్పదం అవుతోంది.