రాజధానికి భూములిచ్చి అన్యాయమైపోయామని నలుగురికి చెప్పుకుందామని నడుచుకుంటూ బయలుదేరాలనుున్న అమరావతి రైతులకు హైకోర్టు చెప్పిన తర్వాత ఏకంగా 20 షరతులు పెట్టి అనుమతులు ఇచ్చారు డీజీపీ గౌతం సవాంగ్. పాదయాత్రలో 157 మంది మాత్రమే ఉండాలని.. రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు ఉండకూడదనేవి ఆ షరతుల్లో ముఖ్యమైనవి. రైతుల పాదయాత్రకు అవసరమైన బందోబస్తు కల్పించాని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.
రైతుల పాదయాత్రను వీలైనంతగా పరిమితం చేసి వారికి ఎవరి మద్దతు లేదని చెప్పే ప్రయత్నంలో ఈ షరతులన్నీ పెట్టారని రైతు జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు భద్రత కల్పించాలని ఆదేశిస్తే పనిలో పనిగా డీజీపీ షరతులు పెట్టినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. అయినా తమ పాదయాత్రను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి అమరావతి వల్ల అన్ని జిల్లాలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తామని రైతులు అంటున్నారు.
దాదాపుగా రెండేళ్లుగా భూములిచ్చిన ైతులు అనేక నిర్బంధాలకు గురవుతున్నారు. పోలీసుల చేతుల్లో దాడులకు గురయ్యారు. భూములిచ్చిన ఎస్సీ రైతలపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారు. అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వంలో మార్పు కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. న్యాయస్థానంలో కేసు వాయిదాలు పడుతూనే ఉంది.