వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులుచేస్తున్న ఉద్యమం హింసాత్మకమయింది. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత మంది పోలీసులపై దాడులు చేశారు. రాళ్లేశారు. మొత్తంగా విధ్వంసం జరిగింది. హింసాత్మకం అయింది. ఇప్పటి వరకూ రెండు నెలల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ఎప్పుడూ పడని మరక పడింది. దీనిపై రైతు సంఘాలు బీజేపీ పై.. బీజేపీ నేతలు రైతు సంఘాలపై ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ మద్దతుదారులు.. రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ప్రచారం ఉద్ధృతంగా ఉంది. అయితే… దాడులు దిగిన వారితో.. రైతులకు ఏం సంబందం లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ విధ్వంసం వెనుక దీప్ సిద్ధూ అనే పంజాబీ సింగర్, యాక్టర్ కీలకంగా వ్యవహరించారు. ఆయన బీజేపీ ఎంపీ సన్నిడియోల్ కు సన్నిహితుడు. గతంలో మోడీతో కలిసి ఫోటోలు కూడా దిగారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవి హైలెట్ అవుతున్నాయి.
ఎవరు చేసినా.. ఏం చేసినా… నింద మాత్రం రైతుల మీద పడింది. రైతులు కట్టు తప్పారని .. ఎర్రకోటపై దాడికి వెళ్లి దేశానికి చెడ్డపేరు తెచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా వెనుకడుగు వేయకుండా పోరాడుతున్న రైతులను ఎలాగైనా వెనక్కి తగ్గేలా చేయడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసింది. రైతు సంఘాల నేతలైప ఎన్ఐఏ కేసులు కూడా పెట్టినంత పని చేసింది. అయితే ఏ ఒత్తిడికీ వారు తలొగ్గలేదు. చివరికి ఏడాదిన్నర పాటు చట్టాలు అమలు నిలిపివేస్తామని ఆఫర్ ఇచ్చారు. అయినా తగ్గలేదు. రైతులు పోరాట పటిమ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రానికి ర్యాలీ హింసాత్మకం ద్వారా ఓ పదునైన కారణం దొరికిందన్న ప్రచారం సాగుతోంది.
రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం కేంద్రానికి పెద్ద విషయం కాదు. అది జాతీయ సమస్య అవుతుందన్న కారణంగానే… సెంటిమెంట్‌గా మారితే రాజకీయంగా సమస్య వస్తుందన్న కారణంగానే నిలిపివేశారు. రైతుల ఉద్యమానికి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హింస.. వారికి కలిసొచ్చినట్లుగా కనిపిస్తోంది. రైతుల ఉద్యమంపై ఇప్పటికే నెగెటివ్ ప్రచారాన్ని ఉద్ధృతంగా చేస్తున్న బీజేపీ సోషల్ మీడియా దాన్ని మరింత పెంచేచాన్స్ ఉంది. ఆ తర్వాత కేంద్రం రైతు ఉద్యమంపై ఉక్కుపాదం మోపి అణిచేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. రైతుల పోరాటం ఎంత స్థాయిలో ఉంటుందో… అంచనా వేయడం కష్టమే. ఎవరు చేసినప్పటికీ.., ర్యాలీలో హింస రైతులకు ఇక్కట్లు తెచ్చి పెట్టబోతోంది.