అదో చిత్రమైన రాజ్యం. ఉన్నట్టుండి ఆ రాజ్యం నిలువుగా చీలిపోయింది. ఇద్దరు చిత్రమైన రాజులు పరిపాలిస్తున్నారు. వారికి చిత్రమైన సందేహాలూ, చిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. రాజ్యం విడిపోకముందు వరకూ అందరూమాట్లాడుకునేది ఒకటేభాషఅయినా రెండుముక్కలయ్యాక ఎవరిభాష వారిదన్నారు. ఎవరిగోల వారిదన్నారు. ఎవరికుంపట్లువారివి. ఎవరి నీళ్లు వారివి. ఎవరి చావులు వారివే అనుకున్నారు. అలాంటి ఆ ఇద్దరు చిత్రమైన రాజులు తప్పనిసరి పరిస్థితుల్లో కలుసుకోవాల్సివచ్చింది. ఉన్నట్టుండి ఒకే రోజున వారికి ధర్మసందేహం కలిగింది. అదితీరక సతమతమవుతుంటే, అర్థరాత్రివేళ ఇద్దరికీ కలొచ్చింది. ఆ కలలో ఇద్దరూ రెస్పెక్ట్ ఇచ్చే ఓ పెద్దాయన కనిపించి, `మీ ధర్మసందేహం తీరాలంటే ఇద్దరూకలసి ఉత్తరానఉన్న వింధ్యాపర్వత శ్రేణుల్లో పరమశివుని గురించి తపస్సు చేసుకోవాలి’ అని చెప్పేయడంతో తెల్లారాక బాధ్యతలను తమ కొడుకులకి అప్పగించి ఉత్తరదిశగా సాగిపోయారు.
కొండప్రాంతంలో ఇద్దరూ కలిసే సాగుతున్నారు. ఎవరైనా చూస్తే ఇద్దరూ మంచి మిత్రులేమో- అనుకోవచ్చు. కానీ క్లోజప్ షాట్ తీస్తే అసలు బండారం బయటపడుతుంది. ఒకాయనేమో చిటపటలాడుతూనే ఉన్నాడు. మరొకాయనేమో తనకేదో దీర్ఘదృష్టిఉన్నట్టు కళ్లముందు అరచేయి ఉంచుకుని పరిశీలనతో చూస్తూ ముందుకుసాగుతున్నాడు. ఒకాయనకేమో బొందకనిపిస్తేచాలు, కెవ్వూ, కేక. తెగసంబరపడిపోతున్నాడు. దాని లోతెంత, పొడవెంతో కొలిచిచూసుకుంటున్నాడు. ఇంకొకడేమో ఎక్కడనలుగురు కనిపించినా వారిని కూర్చోబెట్టి క్లాసులుపీకుతున్నాడు. ఒకరు, సెల్ ఫోన్ లో ప్రత్యక్షప్రసారం ఇస్తూ, `ఆ విధంగా ముందుకు పోతున్నాను, తమ్ముళ్లూ ఈ విషయం అందరికీ చెప్పండీ..’ అంటూ సాగుతుంటే, మరొకరేమో, `హవలాగాడ్నననుకున్నరా, నాకంతా ఎరుకె…’ అంటూ సెల్ ఫోన్ లో ఎవర్నో వాయిస్తూ ముందుకుసాగాడు.
చివరకు ఇద్దరూ అడవిలోకి ప్రవేశించారు. కొంతదూరంపోయాక ఒకతను తనకున్న ముందుచూపుతో దూరంనుంచే అందమైన జలపాతం ఉన్నట్టు పసిగట్టేశాడు. మరోకనికి ఆ పక్కనే ఉన్న ఫలవంతమైన చెట్టు కనిపించింది. కనీసం నీళ్లు పోయక పోయినా ఆ చెట్టు మరో వందేళ్లు కాపుకాస్తుందని అనుకుంటూ సంబరపడిపోయాడు. ఇద్దరూ ఒక పెద్దబండను సెలెక్ట్ చేసుకుని తపస్సుకి అంతా సిద్ధం చేసుకున్నారు. ఒకే బండమీద కూర్చుని తపస్సు చేస్తున్నా, ఒకరు తూర్పుతిరిగి, మరొకరు పశ్చిమదిశగా తిరిగి తపస్సు ప్రారంభించారు.
ధర్మసందేహం తీర్చుకోవడం కోసం. ఒకేఒక్క కోరిక కోరడంకోసం ఇద్దరూ చాలా సీరియస్ గానే తపస్సు కొనసాగిస్తున్నారు. తపస్శక్తి వెండికొండను తాకింది. పరమశివుడు కిందకు చూశాడు. ఇద్దరూ ఒకేలా తపస్సుచేస్తున్నారు. అయినా ఒకరు ఎడమొహం, మరొకరు పెడమొహం. `చిత్రంగా ఉందే…’ అనుకుని ఏకకాలంలో వరాలివ్వాలనుకున్నాడు శివుడు.
వెంటనే శివుడు వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. క్షణం ఆలస్యంచేయలేదు, ఇద్దరూ ముక్తకంఠంతో-
`రైతులకు ఆత్మలెందుకు స్వామీ?’
`అదేం ప్రశ్న. రైతులకు ఆత్మలుంటే మీకొచ్చే నష్టమేంటీ’ శివుని ఎదురుప్రశ్న
`ఇది మా ఉమ్మడి సమస్య స్వామీ’మళ్లీ ముక్తకంఠం.
`ఏమిటది?’ ఆరాతీశాడు శివయ్య
`రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్వామి’
`అయితే, నన్నేం చేయమంటారు. పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు మీవే, మీరే చూసుకోవాలి. సరే, త్వరగా వరం కోరుకోండి. అవతల బీహార్ ఎన్నిక ఫలితాలు తనకే అనుకూలంగా ఉండాలని ఒకాయన గడ్డిపక్కన మంచంవేసుకుని లేవకుండా నన్నే ధ్యానిస్తున్నాడు. అక్కడకు వెళ్ళాలి. త్వరగా వరం కోరుకోండి’ శివుడు తొందరపెట్టాడు.
`రైతులకు ఆత్మలు లేకుండా చూడుస్వామి’ ముక్తకంఠంతో కోరుకున్నారు.
ఆ కోరికతో శివుడు ఉలిక్కిపడి, ఆ తర్వాత కాసేపు కంగారుపడ్డాడు.
`ఇదేంకోరిక… రైతులకు ఆత్మలు లేకుండా చేయడమేమిటీ ?’ శివుడు విసుక్కున్నాడు. ఆయనకు వెంటనే పూర్వఅనుభవాలు సినిమారీళ్లమాదిరిగా కళ్లముందు తిరగాడాయి. ఓ భస్మాసురుడు, మరో గజాసురుడు…కనిపించారు.
సందేహం తీర్చుకోవడంకోసం …
`రైతులకు ఆత్మలు లేకుండా చేయడమెందుకు? అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి??’
`ఈమధ్య రెండు రెండు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువైంది. మాకొచ్చిన డౌటేమిటంటే… రైతులకు ఆత్మలుండబట్టేకదా, వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మలే లేకుండా చేస్తే రైతు ఆత్మహత్యలు ఆగినట్టే కదా స్వామి, అందుకే అలా కోరుకుంటున్నాము. ప్రసాదించుస్వామి, మాకు ఆ వరం ప్రసాదించు. రైతులకు ఆత్మలే లేకుండా చూడుస్వామి…చూడు.’
ఇద్దరూ వరం అడిగేశారు. శివయ్య అడిగిన వరం ప్రసాదిస్తాడనుకునే సమయంలో…
ఇద్దరి ఒంట్లో లక్షలఓల్టు విద్యుత్ ప్రవహించినట్ట యింది. ఒక్కసారిగా అంతెత్తునుంచి ఎగిరిపడ్డట్లయింది. కళ్లుతెరిచి చూసుకుంటే ఎవరి రాష్ట్రంలో వారు , ఎవరిమంచంమీదనుంచి వారు ఠప్పని క్రిందపడ్డారు. కైలాసంలో శివుడు వీరి పరిస్థితి చూసి చిరునవ్వు నవ్వాడు.
– కణ్వస