ఏడాదిలో నాలుగువందల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఓ జాబితా కూడా రిలీజ్ చేసింది. మళ్లీ కేసీఆర్ వస్తారని కష్టాలు తీరుస్తారని ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు పిలుపులు ఇస్తున్నారు. కానీ విచిత్రంగా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన రైతుల ఆత్మహత్యల అంశం తెరపైకి వచ్చింది. పైగా ఆ ఆత్మహత్యల్ని .. రైతులుగా చెప్పకుండా ఆ కుటుంబాల్ని మోసం చేశారన్న నిర్ధారణకు రావడం ఆ పార్టీకి ఇబ్బంది కరమే.
2014-22వరకు ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన రైతుల ఆత్మహత్యల్ని ప్రభుత్వం నమోదు చేయలేదని.. నమోదు చేసినా రైతులని చెప్పలేదని.. ఈ కారణంగా పరిహారం కూడా ఆ కుటుంబాలకు అందలేదు. తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని 141 రైతుల కుటుంబాలు న్యాయపోరాటం చేస్తున్నాయి. రైతులే అయినా పంట నష్టం కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ అధికారుల నివేదికలు తేల్చినా పరిహారం మాత్రం ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆరు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పరిహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది.
ఇప్పుడు న్యాయస్థానం విచారణ జరిపి పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపుగా పది కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. వారికి పంపిణీ చేయనుంది. రోజుకు ముగ్గురు, నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఆ ఆత్మహత్యల్లో నిజం ఎంతో కానీ ఇప్పుడు తమ హయాంలో నిజంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పరిహారం ఇవ్వకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం ఇవ్వడం మాత్రం.. బీఆర్ఎస్ కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని తెచ్చి పెట్టిందని అనుకోవచ్చు.