కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆ చట్టాల గురించి దక్షిణాది రైతులు పట్టించుకోలేదు. వాటి వల్ల జరిగే నష్టం తమకే ఎక్కువగా ఉంటుందని ఉత్తరాది రైతులు అనుకుంటున్నారేమో కానీ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. ఇలా పలు రాష్ట్రాల రైతులు… కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. రైతులు.. వందల్లో ప్రారంభమై.. లక్షలకు చేరుకున్నారు. ఈ రైతు దండును చూసి.. కేంద్రానికి దడపుట్టింది. సరిహద్దుల్లోనే వారిని నిలిపివేశారు. ఫలితంగా ఢిల్లీ సరిహద్దుల్లో గురువారం అంతా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హర్యానా శివార్లలో అక్కడి ప్రభుత్వం , పోలీసులు రైతులపై దమన కాండ నిర్వహించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి అందర్నీ రెచ్చగొడుతున్నారంటూ.. హర్యానా ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. నిజానికి హర్యానా రైతులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. హర్యానాలో బీజేపీ సర్కార్ ఉంది. బీజేపీ సీఎం ఖట్టర్… కేంద్ర నిర్ణయాన్ని ఖండించలేరు. అందుకే.. బిల్లు వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు. అదే విషయాన్ని పంజాబ్ సీఎంతో సవాళ్లు చేస్తున్నారు. రైతులకు నష్టం కలుగుతుందని నిరూపించాలని అంటున్నారు. కానీ రైతుల ఉద్యమం రాజకీయ నేతల చేతుల్లోంచి వెళ్లిపోయింది.
ఆ ప్రభావం ఢిల్లీ శివార్లలో కనిపిస్తోంది. ఇది దేశం మొత్తానికి పాకితే… ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కరోనా కారణంగా చాలా వరకూ ఉద్యమాలకు పులిస్టాప్ పడినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఎగసి పడుతున్నాయి. వాటిని అణిచి వేయడానికి సరిహద్దుల్లోనే.. లోపలికి రాకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది రాజకీయ దుమారానికి కారణం అవుతోంది.