అనంతపురం జిల్లాకు చెందిన నరసింహారెడ్డి అనే రైతు సోషల్ మీడియాలో చాలా ఆవేదనతో ఓ పోస్టు పెట్టారు. సీఎం సార్‌కి.. ఎమ్మెల్యే సార్‌కి చేరాలని.. రూ. పది లక్షలు పెట్టి టమోటా పండిస్తే.. రూ. ఇరవై రూపాయలకు పాతిక కేజీల బుట్ట కొంటున్నారని ఆవేదన చెందారు. అందరూ షేర్ చేయాలని అందులో కోరాడు. ఆ రైతు బాధ చూసి అందరూ.. ఆ వీడియోను షేర్ చేశారు. టీడీపీ నేత లోకేష్‌తో పాటు పలువురు నేతలు ఈ వీడియోను షేర్ చేశారు. వెంటనే.. ఆ రైతను ఆదుకునేందుకు బిగ్ బజార్..డిమార్ట్ లాంటి వాళ్లు వచ్చి..సమీప పట్టణాల నుంచి కొన్ని సూపర్ మార్కెట్ల వాళ్లు వచ్చి.. టమోటాలు కొనుక్కెళ్లారు. ఆ రైతు సమస్య పరిష్కారం అయింది. మరి మిగతా రైతుల సమస్య ఏమిటో మాత్రం.. ఎవరికీ అర్థం కావడంలేదు. అందరూ అలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేకపోతున్నారు. పెట్టినా వైరల్ అయితే తప్ప స్పందించే పరిస్థితి లేదు.
వైరస్‌పై రెండు తెలుగు రాష్ట్రాలు పోరాడుతున్నాయి. అదే సమయంలో.. ప్రజల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు కృషి చేయడం కత్తిమీద సాములా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర రైతులకు పూర్తి స్థాయి అభయం ఇచ్చారు. పంటలన్నీ చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఊరికే వచ్చి కొనుగోలు చేస్తారని.. దీని కోసం 30వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కూడా ప్రకటించారు. దీంతో తెలంగాణలో రైతుల ఆందోళనలు లేవు. కానీ ఏపీలో మాత్రం.. ప్రతీ గ్రామంలోనూ.. రైతులు ఆందోళనతోనే ఉన్నారు. చేతికొచ్చిన పంటను.. ఇంటికి తెచ్చుకోవడం దగ్గర్నుంచి దాన్ని అమ్ముకోవడం వరకూ అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం పెద్దగా చొరవ చూపలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విపక్షాలన్నీ ప్రభుత్వం రైతుల్ని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి. మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. వాటిని ఉపయోగించి పంటలను కొనుగోలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనాను.. డీల్ చేయడమే కాకుండా.. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా.. ఇతర అంశాలను సమన్వయం చేసుకుంటోంది. ఏపీలోనూ ప్రభుత్వం ఇతర అంశాలపై దృష్టి పెట్టింది. కరోనా లాక్ డౌన్ ప్రారంభమైన తరవాత ఇద్దరు సలహాదారులను నియమించింది. రాజధాని భూములకు సంబంధించి .. ఇళ్ల స్థలాలపై రెండు జీవోలు ఇచ్చింది. కరోనాపై పోరాటంలో ఉండాల్సిన కలెక్టర్లకు కొన్ని ఇతర పనులు కూడా.. అప్పగిస్తోంది. అయితే.. వీటిలో రైతు సమస్యలు… పంటలను చేర్చకపోవడం వల్లనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ ఏపీలో ఎక్కువగా వినిపిస్తోంది .