తెలంగాణలో చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు పథకం సాయం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న విషయం బయటకు రాగానే గగ్గోలు మొదలైంది. పథకాన్ని తక్కువ మందికి పరిమితం చేయడానికే ఇలా చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. తెలంగాణలో ఇటీవలి కాలంలో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. ఎక్కువ మంది ధాన్యమే పండిస్తూండటంతో…పరిమితికి మించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఏడాది వ్యవధిలో ధాన్యం దిగుబడి రెట్టింపు అయింది. ఇతర పంటల్నీ ప్రోత్సహించాల్సిన అవసరం గ్రహించిన ప్రభుత్వం వ్యవసాయ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ అనేక సిఫార్సులు చేసింది.
ఇందులో రైతులు.. తమ ఇష్టారితీన పంటలు వేయడం కాకుండా.. ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే మంచిదని సూచించారు. ఏ ఏ పంటలు.. ఏఏ విస్తీర్ణంలోవేయాలి.. ఎక్కడెక్కడ ఏఏ పంటలు బాగా పండుతాయో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి… రైతులు ప్రభుత్వం చెప్పినట్లే చేస్తే బాగుంటుందనేది కమిటీ అభిప్రాయం. అయితే.. రైతులు ఎక్కువ మిగులుతాయి అనుకున్న పంటలే వేస్తారు కాబట్టి.. వారిని చైతన్య పరచాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాలు కూడా ప్రభుత్వం చెప్పిన పంటలు వేసే వారికే ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. కానీ నిర్ణయం తీసుకోలేదు.
ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందని తెలియగానే..విపక్షాలు ముందుగా గొంతు సవరించుకున్నాయి. ప్రభుత్వ బెదిరింపు ధోరణిని ఖండిస్తున్నామని కోదండరామ్ మొదట మీడియా ముందుకు వచ్చారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, బెదిరింపులు సరికాదని చెప్పిన పంటలే వేయాలంటే రాజకీయ జోక్యం పెరుగుతుందన్నారు. ఇక విపక్షాలకు ఇదే ఎజెండా అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ ఘాటు భాషలో రియాక్టయ్యే వరకూ ఈ రచ్చ కొనసాగవచ్చు.