సాగు చట్టాలు రద్దు చేస్తే రైతులు సంతోషపడతారని.. ఓట్లు వేస్తారని బీజేపీ అనుకుందేమో కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సాగు చట్టాల రద్దు ఓ విజయంగానే రైతులు భావిస్తున్నారు. కానీ తాము ఇన్నాళ్లు పెట్టిన కష్టాలకు వారు ఇంకా కోపంగానే ఉన్నారు. చట్టాలు రద్దు చేయడంతోనే తీరిపోలేదు. వారిపై అనేక అక్రమ కేసులు పెట్టారు. రైతుల్ని కార్లతో తొక్కించి.. కాల్పులు జరిపిన అజయ్ మిశ్రా లాంటి వాళ్లు ప్రభుత్వంలోనే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆగ్రహాన్ని బీజేపీ వైపు పూర్తి స్తాయిలో మళ్లించేందుకు వారికి మద్దతుగా ఇతర వర్గాలూ బీజేపీని వద్దనుకునేలా విపక్ష పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నాయి. రైతులపై పెట్టిన దేశద్రోహం వంటి కేసుల ఎత్తివేతకూ డిమాండ్లు వస్తున్నాయి. రైతులపై జరిగిన నిర్బంధం సమయంలో వారిపై ఎన్నో కేసులు పెట్టారు. కొన్ని వందల రాజద్రోహం కేసులు పెట్టారు. వారిని ఖలిస్థాన్ తీవ్రవాదులన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వెనక్కి తగ్గింది.ఇప్పుడు ఆ మాటలన్నీ తప్పు అని అంగీకరించాల్సిన పరిస్థితి వస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కో రైతు కుటుంబానికి రూ. మూడు లక్షల సాయం ప్రకటించారు. దీంతో కేంద్రంపైనా ఒత్తిడి పెరుగుతోంది. కానీ కేంద్రం సాయం ప్రకటిస్తే తాము తప్పు చేసినట్లుగా మళ్లీ మళ్లీ అంగీకరించినట్లవుతుంది.అది పాజిటివ్ కన్నా ఎక్కువ నెగెటివ్ చేస్తోంది. ఓ రకంగా సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కున్నట్లయింది. బయట పడటం చాలా కష్టం.