మాజీ కేంద్ర మంత్రి మరియు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కే చెందుతుందని చెప్పి సరికొత్త వివాదానికి తెర తీశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తమదేనని భారత్ చేస్తున్న వాదనలు అర్ధరహితమని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత్ కి చెందుతాయని అన్నారు. కనుక పాక్ ఆక్రమిత కాశ్మీర్ తమదేనని భారత్ వాదించడం మానుకోవాలని ఆయన సలహా ఇచ్చేరు.
అలాగే భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని అన్నారు. ఒకవేళ యుద్ధం ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటే ఇప్పటికే యుద్దాలు చేసాము కనుక అవి పరిష్కారం అయ్యి ఉండాలి. కానీ పరిష్కారం కాలేదు కనుక సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
కేంద్ర మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా చాలా కీలక పదవుల్లో పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా ఈవిధంగా పాకిస్తాన్ కి మద్దతు పలకడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కి చెందుతుందని ఏ హోదాతో ప్రకటించారో తెలియదు. కానీ కనీసం జమ్మూ కాశ్మీర్ రాష్ర్టం భారత్ కి చెందుతుందని అంగీకరించినందుకు సంతోషపడాలి. ఎందుకంటే భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ను రెండు దేశాలకు చెందిన సమస్యగా పాక్ చిత్రీకరిస్తూ, దాని గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ, కాశ్మీర్ పై భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. కనుక కాశ్మీర్ కూడా పాకిస్తాన్ కే చెందుతుందని ఫరూక్ అబ్దుల్లా చెప్పకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ముఫ్తీ మొహమ్మద్ సయ్యీద్ కూడా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజలను ఉద్దేశ్యించి చేసిన మొట్ట మొదటి ప్రసంగంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగనిచ్చినందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాక్ ఉగ్రవాదులకు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని వేర్పాటువాదులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే తమ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి, కేంద్రప్రభుత్వానికి తెలియకుండా మసరత్ ఆలం అనే ఒక కరడుగట్టిన వేర్పాటువాదిని జైల్లో నుండి విడిచిపెట్టారు. సున్నితమయిన సరిహద్దు రాష్ట్రంలో ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వత్తాసుపలికేవారు ఉండటం భారత్ దౌర్భాగ్యం అనుకొంటే, అదే పాకిస్తాన్ కి కలిసివచ్చే అంశంగా మారుతోంది.
గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై దొంగ దెబ్బ తీస్తూ అనేక వందలమంది ప్రజలను పొట్టనపెట్టుకొన్నారు. అందుకు చాలా బలమయిన కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. ఒకపక్క ప్రభుత్వంపై సైన్యాధికారుల కర్ర పెత్తనం చేస్తుండటం, వాపును చూసి బలుపు అనుకొంటూ ఎప్పుడూ భారత్ పై కాలుదువ్వే వారి యుద్ద కాంక్ష, దేశం అభివృద్ధికి నోచుకోకపోవడం, ఆకారణంగా నిరుద్యోగం, దారిద్ర్యం, అవినీతి, మతోన్మాధం చివరికి అది ఉగ్రవాధంగా రూపాంతరం చెందుతుండటం వంటి అనేక సమస్యలు పాకిస్తాన్ న్ని పట్టిపీడిస్తున్నాయి. వాటి నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికే భారత్ ని బూచిగా చూపిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ, రక్షణ, ఇచ్చి భారత్ పై దాడులకు పాల్పడుతోంది. నేటికీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం పాకిస్తాన్ అని ఫరూక్ అబ్డుల్లాకి తెలుసు. ఉగ్రవాదుల దాడుల్లో భారత ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఆయన కళ్ళారా చూస్తూనే ఉన్నారు.
పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు భారత్ కి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా దానితో శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఫరూక్ అబ్దుల్లా ఏవిధంగా సలహా ఇస్తున్నారో ఆయనకే తెలియాలి. ఆయన సలహా ఇచ్చినా ఇవ్వకున్నా ఇంతవరకు భారత్ ఎన్నిసార్లు పాకిస్తాన్ కి స్నేహహస్తం అందించిందో, దానికి పాక్ ఏవిధంగా స్పందిచిందో కూడా ఫరూక్ తెలియదనుకోలేము. పాకిస్తాన్ వంటి మతోన్మాద, ఉగ్రవాద దేశానికి అతి సమీపంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ కి వత్తాసు పలికే ఇటువంటి రాజకీయనాయకులు ఉండటం భారత్ కి ఎప్పటికయినా ప్రమాదమే.