వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేశారో… మరో ఘటనను.. జమ్మూకశ్మీర్ సీనియర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. అప్పట్లో.. తనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తే.. కాంగ్రెస్ హైకమాండ్‌కు… రూ. 1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమంటూ.. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండే.. ఇతర పార్టీల పెద్దల ద్వారా జగన్.. రాయబారం నడిపారు. అలా రాయబారం నడపమని… జగన్.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను కూడా కలిశారు. ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా.. కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రజలకు వెల్లడించారు. అప్పట్లో .. కాంగ్రెస్ తను సీఎం చేస్తే రూ.1500కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేసుకున్నారు. డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటారని.. జగన్‌కు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన ఫరూక్ అబ్దుల్లా… దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై.. ఓటర్లకు అవగాహన కల్పించేప్రయత్నం చేశారు.
ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఏం తింటున్నా మనం భారతీయులమని.. అయితే ప్రాంతాల వారీగా..మతాలవారీగా.. రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని తిప్పికొట్టాని పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులంతా ఏకమై నడిచారని గుర్తు చేశారు. ఇప్పుడూ అంతే దేశం కోసం అందరూ ఏకమై.. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎవరు ముస్లింలు, ఎవరు దళితులంటూ.. మతాలవారీగా రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామమందిరం గుర్తొస్తుందని.. ఐదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ఫరూక్ ప్రశ్నించారు. ఏం మనకు బుర్ర లేదనుకుంటున్నారా?..వాళ్లు ఏం చెబితే అది నమ్ముతాం అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. మాది సరిహద్దు రాష్ట్రం.. పాకిస్తానేంటో..తీవ్రవాదమేంటో…పరిస్థితి మాకు తెలుసు.. రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు గురించి ఫరూక్ కొన్ని మంచి మాటలు చెప్పారు. అద్బుతమైన కార్యక్రమాలు తీసుకున్నారని .. అన్ని వర్గాలవారికి, మహిళల కోసం, యువత కోసం..
వ్యవసాయదారుల కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు. దేవుడు మనకు అవకాశమిచ్చాడు..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్నారు. మన జీవితాల స్వర్గం చేసుకుంటామా?.. నరకం చేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. నా సుదీర్ఘ అనుభవంతో ముస్లిం సోదరులకు, ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్ గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడు… జగన్,చంద్రబాబు ఇద్దరికి ఉన్న తేడా నాకు స్పష్టంగా తెలుసు..మీరూ తెలుసుకోండి అని ఫరూక్ సూచించారు.