వంశీది ఓ ప్రత్యేకమైన మార్క్. కథానాయిక కట్టు బొట్టు దగ్గర్నుంచి… ఫ్రేమ్
వరకు ఆయనకి మాత్రమే సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఎవరైనా అలా తీస్తే వంశీ మార్క్‌ని ఫాలో అయిపోయావా అనడాన్నీ వింటుంటాం. అయితే కొంతకాలంగా వంశీ నుంచి ఆయన మార్క్ సినిమాలు రావడమే కరువైపోయాయి. ఆ వినోదం, ఆ కథలు ఇటీవవల వంశీ సినిమాల్లో అస్సలు కనిపించడం లేదు. అయితే ప్రేక్షకులు మాత్రం ఇంకా ఆయనపై నమ్మకంతోనే కనిపిస్తున్నారు. ఆయన మెగాఫోన్ పట్టిన ప్రతిసారీ వంశీ మెరుపులు మళ్లీ చూడకపోతామా అనే ఓ భరోసాతో సినిమా చూసేందుకు సిద్ధమైపోతుంటారు. ఈసారి సరాసరి ఆయన తీసిన క్లాసిక్ సినిమా లేడీస్ టైలర్‌కి సీక్వెల్ అంటూ `ఫ్యాషన్ డిజైనర్` పట్టాలెక్కించడంతో ఆ సినిమాపై మరింత భరోసాని పెంచుకొన్నారు. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందా? వంశీ మాయాజాలం మళ్లీ తెరపై కనిపించిందా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…
కథ
బాలగోపాలం (సుమంత్ అశ్విన్) తన తండ్రి సుందరంలాగే లేడీస్ టైలర్. అయితే ఊళ్లోనే లేడీస్ టైలర్‌గా కొనసాగడం ఇష్టం లేని గోపాలం నర్సాపురం వెళ్లి ఓ పెద్ద షాప్ తెరిచి, ఫ్యాషన్ డిజైనర్‌గా పిలిపించుకోవాలని ఆశపడుతుంటాడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందా అనుకొంటూ వెళ్లి ఓ జ్యోతిష్యుడిని కలుస్తాడు. ఆయన గోపాలం చేయి చూసి మన్మథరేఖ ఉందని చెబుతాడు. అరచేతిలో ఆ రేఖ ఉంటే అమ్మాయిల మనసుల్లో అలవోకగా స్థానం సంపాదించొచ్చు అని చెబుతాడు. దాంతో ఊళ్లో గేదెలు, ఆస్తి ఎక్కువగా ఉన్న ఇంటికి చెందిన రాణి (మానస)ని చూసి ప్రేమిస్తున్నా అంటూ వెంటపడతాడు. ఎంతమంది తనని ప్రేమిస్తున్నా రాణి మాత్రం గోపాలంనే ఇష్టపడుతుంది. కానీ ఇంతలో గవర్రాజు ఇంటికి ఆయన మేనకోడలు అమ్ములు (మనాలి రాథోడ్) బట్టలు కుట్టేందుకు వెళతాడు గోపాలం. అమ్ములుకి ఇంకా ఎక్కువ ఆస్తి ఉందని ఆమెని ప్రేమిస్తాడు. వాళ్లిద్దరికంటే కూడా అమెరికా నుంచి ఊళ్లోకి వచ్చిన మహాలక్ష్మి (అనీషా)కి ఇంకా ఎక్కువ ఆస్తి ఉందని ఆమె చుట్టూ తిరుగుతాడు. ఈ ముగ్గురిలో నన్ను త్వరగా పెళ్లి చేసుకో అంటూ వెంటపడిన అమ్ములు హత్యకి గురవుతుంది. మరి ఆ హత్య చేసింది ఎవరు? గోపాలంతో జీవితం పంచుకొనేది ఎవరు? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
మరోసారి తన మార్క్‌ని చూపించడంలో విఫలమయ్యారు వంశీ. లేడీస్ టైలర్‌కి కొనసాగింపు అంటే భారీగా అంచనాలు ఉంటాయని తెలిసినా… వినోదం విషయంలో కానీ, కథని తీర్చిదిద్దడంలో కానీ ఎక్కడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొన్నట్టు అనిపించలేదు. తెరపై సన్నివేశాలు సాగిపోతుంటాయి తప్ప వాటి ప్రభావం మాత్రం ప్రేక్షకులపై ఏమాత్రం కనిపించదు. కానీ ఎప్పట్లాగే వంశీ గోదావరి అందాల్ని మాత్రం చాలా బాగా చూపించాడు. కథంతా ఆ నేపథ్యంలోనే సాగుతుంది కాబట్టి సన్నివేశాల్ని, పాటల్ని మొత్తం గోదావరి అందాల చుట్టూనే తిప్పాడు. వాటితోనే సాంత్వన చెందాలి తప్ప మిగతా ఎక్కడా ప్రేక్షకులకి సంతృప్తి లభించదు. కామెడీ కూడా వికారంగా తయారైంది. ఏ సన్నివేశాన్నీ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేం. లేడీస్ టైలర్‌తో ఈ సినిమాకి ముడి పెట్టి చూస్తే… ఫ్యాషన్ డిజైనర్ ఏమాత్రం కంటికి ఇంపుగా ఆనదు. వంశీ శైలి వేరు. ఆయనకు కాస్త అలవాటు పడితే.. వంశీ టేకింగ్‌లోని మహత్య్యం తెలుస్తుంది. కానీ.. వంశీ స్కూల్ ఈతరం ప్రేక్షకులకు అర్థం కానిదే. ఆ కామెడీ.. మరీ ఓవర్‌గా అనిపిస్తే.. అది ఈతరం ప్రేక్షకుడి తప్పు కాదు. లేడీస్ టైలర్‌కి సీక్వెలో, రీమేకో తీయడంలో తప్పులేదు. కానీ… టేకింగ్ పరంగా, కథ కథనాల పరంగా.. నేనింకా 30 ఏళ్ల క్రితంలానే ఆలోచిస్తానంటే కుదరని పని. ప్రధమార్థం, ద్వితీయార్థం.. రెండింటిలో కూడా పట్టుమని పది నిమిషాలు ప్రేక్షకుడ్ని కుదురుగా కుర్చోబెట్టే సన్నివేశాలు లేవు. ఈ కథలో మర్డర్ ఎలిమెంట్స్ జోడించడం కూడా అర్థం పర్థం లేకుండా మార్చేశాయి.
నటీనటుల ప్రతిభ
వంశీ సినిమాల్లో ఏ నటుడైనా ఒకేలా బిహేవ్ చేస్తుంటాడు. ఆ లోపం ఈ సినిమాలోనూ కనిపించింది. సుమంత్ అశ్విన్ తన కెరీర్‌కి ఈ సినిమా ఎలా ఉపయోగపడుతుందని భావించాడో అర్థం కాదు. బహుశా.. వంశీ దర్శకుడు కాబట్టి, ఈ కథకు ఓకే చెప్పి ఉండొచ్చు. హీరోయిన్లు ముగ్గురున్నా… వాళ్ల వల్ల ఉపయోగం లేదు. అనీషా కాస్త హాటుగా, ఘాటుగా కనిపించింది. ఆఖరికి కృష్ణ భగవాన్ పంచ్‌లూ పేలలేదు. మిగిలిన వాళ్ల గురించి ఏం మాట్లాడుకొంటాం??
సాంకేతిక వర్గం
వంశీ సినిమా అంటే.. మిగిలిన అందరూ వంశీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. అందుకే ప్లస్సులకూ, మైనస్సులకూ వంశీనే బాధ్యుడు. మణిశర్మ బాణీల్లో కొన్ని ఆకట్టుకొంటాయి. వంశీ శైలికి తగ్గట్టుగానే పాటలు సాగాయి. రీ రికార్డింగ్ కూడా వెరైటీగానే అనిపించింది. గోదారి అందాలను కెమెరాలో చక్కగా బంధించగలిగారు. ఇక ఎడిటింగ్, కథ, కథనాలు వీటి గురించి చెప్పుకోకపోవడమే మంచిది. ఇంత సాధారణమైన కథ, అత్యంత సాధారణమైన టేకింగ్… వంశీ సినిమాల్లోనే చూసి ఉండమేమో.
ఫైనల్ టచ్ : దారం ఊడిపోయింది.. కత్తెర పదును తగ్గింది
రేటింగ్: 2