జమజచ్చ… అంటూ పాతికేళ్ల క్రితం నవ్వుల పూవులు పూయించాడు లేడీస్ టైలర్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమైంది. అదే.. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్. వంశీ దర్శకుడు. మధుర శ్రీధర్ నిర్మాత. అప్పటి లేడీస్ టైలర్… రాజేంద్రప్రసాద్ అయితే, ఇప్పటి ఫ్యాషన్ డిజైనర్ సుమంత్ అశ్విన్. ట్రయిలర్ కూడా బయటకు వచ్చేసింది. వంశీ శైలి ఫ్రేములు, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ బాగానే కనిపిస్తున్నాయి. మణిశర్మ పాటలూ ఊరిస్తున్నాయి. ఇక… గోదారి అందాల గురించి చెప్పక్కర్లెద్దు. మరోసారి గోదావరిని వెండి తెరపై పాయలు పాయలుగా పారించే ప్రయత్నం చేశాడు వంశీ. ముగ్గురు కథానాయికలున్నారు కాబట్టి.. గ్లామర్‌కి లోటు లేదు. అన్నట్టు ఇందులో విలన్ కూడా ఉన్నాడండోయ్. అదెవరన్నది కాస్త సస్పెన్స్‌గా ఉంచారు. వంశీనీ, ఆయన తరహా టేకింగునీ, మరీ ముఖ్యంగా గోదారి అందాల్నీ ఇష్టపడేవాళ్లని కాస్త టెమ్ట్ చేసేలానే ఉంది ఈ ట్రైలర్. కాస్త మీరూ ఓ లుక్కేసుకోండి. జూన్ 2న ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.