రెక్కలు ముక్కలు చేసి చదవిస్తూంటే.. ప్రేమ పేరుతో దారి తప్పుతోందని… ఓ తండ్రి కన్న కూతురికి మరణశిక్ష విధించాడు. పదే పదే వద్దని చెబుతున్నా… అదే పనిగా ఫోన్లో మాట్లాడుతోందని… అంతిమ తీర్పు చెప్పేశాడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం తోటరావులపాడులో ఈ ఘటన జరిగింది. గ్రామంలో నివసించే కోటయ్య అనే వ్యక్తిని చంద్రిక అనే కుమార్తె ఉంది. ఆమె బీఫార్మసీ చదువుతోంది. కొద్ది రోజులుగా చంద్రిక ప్రవర్తనపై కోటయ్య ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడూ చూసినా ఫోన్లలో మాట్లాడుతూంటంతో.. చాలా సార్లు చెప్పి చూశాడు. కానీ చంద్రిక రహస్యంగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. శనివారం కూడా అలాగే ఫోన్లో మాట్లాడుతూంటంతో.. ఆగ్రహంతో… చేతికి దొరికిన గొడ్డలి కర్రను తీసుకుని బాదేశాడు. ఆ దెబ్బలకు తాళలేక చంద్రిక మృతి చెందింది.
కోటయ్య తీవ్ర ప్రవర్తన.. కుటుంబసభ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. కూతుర్ని చంపుకునేంత మనస్థత్వం ఆయనది కాదని అంటున్నారు. కానీ పరువు పోతుందనే ఆవేదనతో.. కూతురికి భయం చెప్పాలన్న ఉద్దేశంతో.. గట్టిగా కొట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చంపేయాలన్న ఉద్దేశంతో కాదని అంటున్నారు. అయితే కోటయ్యకు అంత పరువు భయం ఎందుకొచ్చిందంటే… రెండు రోజుల ముందు బయటకు వచ్చిన అగిరిపల్లి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఉదంతం గుర్తు చేస్తున్నారు. అగిరిపల్లి ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని.. మిత్రులను నమ్మి హోటల్‌కు వెళ్లింది. వాళ్లు రేప్ చేయడమే కాదు.. ఫోన్ లో షూట్ చేసి… అమ్మాయి పరువును బజారున పడేశారు.
ఎలాగోలా సెటిల్ చేసుకుందామనుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులకు.. చివరికి క్షోభే మిగిలింది. ఒక్క సారి అమ్మాయి గురించి అలాంటి వీడియోలు బయటకు వస్తే.. ఆ తల్లిదండ్రులు పడే క్షోభ ఎలా ఉంటుందో వర్ణించలేం. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని తండ్రి.. తప్పనిసరి పరిస్థితుల్లో ఫిర్యాదు చేశాడు కానీ… ప్రచారం వద్దే వద్దని బతిమాలుకున్నారు. బయటకు చెప్పవద్దని మీడియా, పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసింది. కృష్ణా జిల్లాలో.. చర్చనీయాంశమయింది. కాలేజీకి వెళ్తున్న ప్రతి మధ్యతరగతి ఆడపిల్ల తండ్రిలోనూ భయాలను నింపింది.
ప్రేమ మత్తులో పడి తన కూతురు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకుంటుందేమోన్న ఆందోళనతో.. మధ్యతరగతి మనస్థత్వం ఉన్న కోటయ్య… చేజేతులా కూతుర్ని చంపేసుకున్నాడు.