విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కి వ్యతిరేకంగా ఓ ఫత్వా కలకలం రేపుతోంది. ముస్లిం మహిళలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎవరైనా పోటీ చేస్తే ఆమెని ఓడించాలని 2009లో ముస్లిం మత గురువు మౌలానా ఖధీర్ రజ్వీ ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు అది తెరపైకి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మల్లికా బేగంను ఉద్దేశించే ఈ ఫత్వా జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక జలీల్ ఖాన్ కుట్ర ఉందని.. మల్లికాబేగం అదే పనిగా ఆరోపించారు కూడా. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె టీడీపీ అభ్యర్దిగా నిలబడటంతో ఈ ఫత్వా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తనకు జారీ చేసిన ఫత్వా జలీల్ ఖాన్ కుమార్తెకు ఎందుకు వర్తించదు అంటూ మల్లికా బేగం మత పెద్దలను ప్రశ్నిస్తున్నారు.
లగడపాటి రాజగోపాల్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మల్లికాబేగం 2005లో కార్పొరేటర్‌గా గెలిచారు. 2009 ఎన్నికలలో లగడపాటి ఆమెకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించారు. నేరుగా పేరు పెట్టి చెప్పకపోయినా… మల్లికాబేగం పోటీ చేస్తున్న సమయంలోనే… ముస్లిం మహిళలు పోటీ చేస్తే ఓడించాలనే ఫత్వాను జారీ చేశారు. జలీల్ ఖాన్ కావాలనే ఈ ఫత్వా జారీ చేయించారని ఆరోపణలు వచ్చాయి. చివరికి మల్లికా బేగం పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలోకి దిగుతున్నారు. ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. అయితే గతంలో తనకు ఫత్వా జారీ చేసిన మత పెద్దలు జలీల్ ఖాన్ కుమార్తెను ఎన్నికల్లో ఎలా పోటీ చేయిస్తారని మాజీ మేయర్ మల్లికాబేగం ముస్లిం మత గురువు ను ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులుగా మత గురువు నివాసానికి, దర్గాకు వెళ్ళి పత్వా జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫత్వా వివాదాన్ని జలీల్ ఖాన్ లైట్ తీసుకుంటున్నారు. 2009లో జారీ అయిన ఫత్వాకు తనకు సంబంధం లేదన్నారు. అయినా పెద్దలను లెక్కచేయకుండా పోటీ చేసి ఓడిపోయిన మల్లికా బేగం కు తమను ప్రశ్నించే అర్హత లేదని తేల్చారు. ఆ రోజు ఆమె పోటీ నుంచి తప్పుకుని ఉంటే.. నేడు తాను కూడా తన కూతుర్ని పోటీలో దింపేవాడిని కాదని జలీల్ ఖాన్ అంటున్నారు. మొత్తానికి ఫత్వా వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.