తమిళనాడుకి చెందిన తౌహీద్ జమాత్ అనే మత సంస్థ నిన్న ఒక ఫత్వా జారీ చేసింది. ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబాకి చెందిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులలో గోమూత్రం ఉపయోగిస్తునందున దానిని ముస్లింలు ఎవరూ వాడరాదని ఆదేశిస్తూ ఒక ఫత్వా జారీ చేసింది. ఇస్లాం మతంలో గోమూత్రం వాడకం నిషేదించబడింది కనుక అది కలిసిన పతంజలి ఉత్పత్తులను ముస్లిం మతస్తులు ఎవరూ వాడరాదని ఫత్వాలో పేర్కొంది.
పతంజలి తయారు చేస్తున్న ఔషధాలు, సౌందర్య సాధనాలు, కొన్ని ఆహార ఉత్పత్తులలో గోమూత్రం వాడుతోందని తౌహీద్ జమాత్ తన ఫత్వాలో పేర్కొంది. ఆ సంస్థ జారీ చేసిన ఈ ఫత్వా ప్రభావం కొందరు హిందువులు, ఇతర మతస్థులపై కూడా పడినట్లయితే పతంజలి వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పతంజలి ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేసుకొంటోంది. కనుక ఇటువంటి ఫత్వాలు దాని విదేశీ వ్యాపారావకాశాలను కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. మరి పతంజలి సంస్థ ఈ ఫత్వాపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.