కాంగ్రెస్ నేత శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్ లో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొన్నారని మొదట పోలీసులు భావించారు. కానీ డిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఆమెపై ‘పొలోనియం’ అనే రేడియో ధార్మిక పదార్థం ప్రయోగించబడిందని చెప్పడంతో దానిని హత్యకేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మిస్టరీని చేదించేందుకు వారు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ.) సహాయం కోరారు.
ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను ఎఫ్.బి.ఐ.కి పంపించి దానిపై వారి అభిప్రాయం కోరారు. సుమారు తొమ్మిది నెలల తరువాత ఆ నివేదిక నిన్న డిల్లీ పోలీసులకి అందింది. అందులో చాలా ఆశ్చర్యకరమయిన విషయం బయటపడింది. సునంద పుష్కర్ సునంద మృతికి పొలోనియం కారణం కాదని ఎఫ్.బి.ఐ. తన నివేదికలో పేర్కొంది. కానీ ఆమె ఏవిధంగా మృతి చెందారనే విషయంపై ఎఫ్.బి.ఐ. తన నివేదికలో ఏమి చెప్పింది? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. కనుక సునందా పుష్కర్ ని ఎవరయినా హత్య చేసారా లేక ఆమె ఆత్మహత్య చేసుకొన్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బాసీ మీడియాతో మాట్లాడుతూ “త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మరి కొన్ని నిజాలు తెలుస్తాయి’ అని మాత్రమే చెప్పారు. సునంద పుష్కర్ దేశ విదేశాలలో చాలా పలుకుబడి ఉన్న కాంగ్రెస్ నేత శశి ధరూర్ భార్య కావడంతో, ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.