టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున బియ్యం స్కాంకు పాల్పడ్డారని ఎనిమిదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారని బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు వివాదంతో రైతుల్ని తమకు వ్యతిరేకంగా చేయాలని కేసీఆర్ అనుకోవడంతో రివర్స్‌లో బీజేపీ నేతలు ఈ విమర్శలు చేశారు. తర్వాత ఎఫ్‌సీఐ పైపైన చేసిన విచారణలో దాన్యం గల్లంతయినట్లుగా తేలింది. దీంతో సీబీఐ విచారణ చేయించాలని కాంగ్రెస్ నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. చివరికి తనకు వస్తున్న సవాళ్లను సీరియస్‌గా తీసుకున్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎఫ్‌సీఐ అధికారులతో పూర్తి స్థాయి తనిఖీసలు చేయిస్తున్నామని ప్రకటించారు.
కిషన్ రెడ్డి ప్రకటన తర్వాత ఇప్పుడు సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మాయమైన ధాన్యం లోగుట్టు కనిపెట్టనున్నారు. టీఆర్ఎస్ – బీజేపీ ధాన్యం సవాళ్ల కారణంగా ఈ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైంది. ఇప్పుడు అన్ని మిల్లుల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. గల్లంతయిన బియ్యం అంతా ఎక్కడికి వెళ్లింది ? దీని వెనుక ఏదైనా పెద్ద స్కామ్ ఉందా అన్న విషయాలపైనా ఆరా తీయనున్నారు.
ఇప్పటికే ఈ అంశం తెలంగాణలోని రెండు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. రాజకీయ గొడవలు తమకు లేనిపోని చిక్కులు తెచ్చి పెడుతున్నాయని రైస్ మిల్లర్లు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ తనిఖీల్లో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఎక్కువ మంది మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.ఏ విచారణ జరిగినా రాజకీయ నేతల అవినీతి మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు.