ఫిబ్రవరిలో కొత్త సినిమాల జోరు ఎక్కువగానే కనిపించబోతోంది. తొలి వారంలో `తండేల్` విడుదలైంది. నాగచైతన్య కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాతో దక్కాయి. అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయం ఈ సినిమాతో దక్కినట్టైంది. ‘తండేల్’ వసూళ్లు సోమవారం నుంచి ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరం.
రెండోవారంలోనూ కొత్త సినిమాలు జోరుగా రాబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగు సినిమాలు ఈవారం విడుదల కానున్నాయి. ఇందులో విశ్వక్సేన్ ‘లైలా’ ఒకటి. విశ్వక్ ఆడ వేషం వేసిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లలో యూత్ కంటెంట్ కనిపిస్తోంది. విశ్వక్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తనకు ఇప్పుడు ఓ విజయం కావాలి. పబ్లిసిటీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరంజీవిని తీసుకొచ్చి, అందరి దృష్టీ ఈ సినిమాపై పడేలా చేశాడు. ఈ బజ్ ఓపెనింగ్స్‌కి ఉపయోగపడుతుంది. ఆ తరవాత కంటెంట్ బాగుంటే నిలబడుతుంది.
బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్… తాతా మనవళ్లుగా నటించిన సినిమా ‘బ్రహ్మానందం’. ఈ వారమే వస్తోంది. బ్రహ్మానందం నటన, ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకు ప్రధాన బలం. వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు కాబట్టి కామెడీకి ఢోకా ఉండదు. స్వధర్మ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. వాళ్ల నుంచి ఇది వరకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మళ్లీ రావా, మసూధ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందని దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు.
ఐదేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ఐదేళ్లకు థియేటర్లో ఓ సినిమా వస్తోంది. అదే ‘ఇట్స్ కాంప్లికేటెడ్’. సిద్దు జొన్నలగడ్డ హీరో. ఓటీటీలో ఈ సినిమాని ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే పేరుతో వచ్చింది. అప్పట్లో ఓటీటీలో బాగానే ఆడింది. ఇప్పుడు సిద్దు ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఓటీటీలో ఇప్పటికే చూసేసిన జనం.. ఇప్పుడు టికెట్ కొని థియేటర్‌కి వెళ్లి మరీ చూస్తారా? అనేది అనుమానం.
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ‘తల’ అనే సినిమా తయారైంది. అమ్మ రాజశేఖర్ తనయుడే ఈ సినిమాలో హీరో. ట్రైలర్లో యాక్షన్ బీభత్సంగా ఉంది. ఈమధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువ ఆడుతున్నాయని, తమ ‘తల’ కూడా ఆడేస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది