జనవరి అంతా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రభంజనం సాగింది. ఈ ఆదివారం కూడా.. ఈ సినిమాదే హవా. అయితే ఫిబ్రవరిలో కొత్త సినిమాలు వరుస కడుతున్నాయి. ఈవారం నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సైడ్ అయిపోవాల్సిన పరిస్థితి. ఫిబ్రవరి తొలి వారంలో 3 సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. వాటిలో ‘తండేల్’పైనే అందరి దృష్టీ వుంది.
నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా `తండేల్`. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ నిర్మించింది. ప్రేమ, దేశభక్తి మిక్స్ చేసిన కథ ఇది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకొంటున్నాయి. ముఖ్యంగా బుజ్జితల్లి, హైలెస్సా.. ఇన్స్టెంట్గా ఎక్కేశాయి. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సాయి పల్లవి… ఈ సినిమాకు ప్రధానబలం. అందుకే చైతూ, అరవింద్… వీళ్లంతా ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు.
ఇదేవారం అజిత్ ‘పట్టుదల’` రిలీజ్ కానుంది. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే అజిత్‌కు తెలుగులో అంతగా మార్కెట్ లేదు. కాకపోతే.. ఈరోజుల్లో ఏ అనువాద సినిమానీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యాక్షన్ ప్రియులకు ‘పట్టుదల’ మంచి ఆప్షనే. పూరి సోదరరుడు సాయిరామ్ శంకర్ సినిమా ‘ఒక పధకం ప్రకారం’ ఈ వారమే వస్తోంది. విలన్ ఎవరో ఊహించిన వాళ్లకు పది వేలు ఇస్తామంటూ చిత్రబృందం చేస్తున్న వినూత్న ప్రచారం ఈ సినిమా ప్రమోషన్లకు ఉపయోగపడుతోంది. అయితే ‘తండేల్’తో పోలిస్తే ఈ రెండు సినిమాలూ ప్రమోషన్, బజ్ విషయంలో చాలా దూరంలో ఉండిపోయాయి. ఈవారం `తండేల్`కు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మిగిలిన సినిమాల ఫలితం మౌత్ టాక్‌పై ఆధారపడి ఉంది.