జనవరిలో సంక్రాంతి సినిమాలకి క్రేజ్ వుంటుంది. ఆడియన్స్ దాదాపు బడ్జెట్ ఆ సినిమాలకే పెట్టేస్తారు. మార్చిలో పరీక్షలు వస్తాయి. దానికి ప్రిపరేషన్ ఫిబ్రవరి నుంచి మొదలుతుంది. అందుకే ఫిబ్రవరిని సినిమాలకి అన్ సీజన్ గా భావిస్తారు. కానీ కొన్నాళ్ళుగా ఆ ట్రెండ్ మారింది. ఫిబ్రవరి లో కూడా కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో డజనకు పైగా సినిమాలు బాక్సాఫీసు ముందుకు వచ్చాయి.
ఫిబ్రవరి 6న వచ్చిన డబ్బింగ్ సినిమా పట్టుదల డిజాస్టర్ అయ్యింది. అసలు అజిత్ సినిమా ఒకటి వచ్చి వెళ్ళిందనే సంగతి కూడా చాలా మందికి తెలీదు. అంత వీక్ కంటెంట్ ఇది.
నాగ చైతన్య తండేల్ సినిమా ప్రేమికుల రోజుని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 7న వదిలారు. సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. పాటలు జనాల్లోకి వెళ్ళడం ప్లస్ అయ్యింది. అయితే రెండో రోజే సినిమా పైరసీ బారిన పడింది. సిటీ కేబుల్స్ తో పాటు ఆర్టీసీ బస్సుల్లో కూడా సినిమా వేశారు. ఇవన్నీ దాటుని చైతుకి తొలి వందకోట్ల సినిమా అయ్యిందని నిర్మాతలు సగర్వంగా ప్రకటించారు.
ప్రేమికుల రోజున వచ్చిన లైలా, బ్రహ్మ ఆనందం.. ఈ రెండు సినిమాలు నిరాశ పరిచాయి. లైలా సినిమాకి అయితే చాలా దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. మతిగతి లేని సినిమా అంటూ విమర్శకులు విరుచుకుపడ్డారు. విశ్వక్ ఫ్యాన్స్ కి సైతం ఈ సినిమా నచ్చలేదు. దీంతో అందరికీ ఓపెన్ గా సారీ చెప్పి ఓ లెటర్ రిలీజ్ చేశాడు విశ్వక్.
ధన్ రాజ్ దర్శకుడిగా చేసిన సినిమా ‘రామం రాఘవం’. ఈ సినిమా సరైన వసుళ్ళూ దక్కలేదు కానీ ధన్ రాజ్ మంచి ప్రయత్నం చేశాడనే ప్రశంస దక్కింది. ఫిబ్రవరి మూడో వారంలో డ్రాగన్, జాబిలమ్మా నీకు అంత కోపమా డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. రెండూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్. అయితే ఇందులో డ్రాగన్ సినిమా బాక్సాఫీసు ముందు ప్రభావం చూపింది. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో చేసిన బాపు సినిమా ఆడియన్స్ ని థియేటర్స్ లోకి రప్పించడంలో విఫలమైయింది.
ఫిబ్రవరి చివరి వారంలో సందీప్ కిషన్ మజాకా తో వచ్చాడు. ధమాకా తర్వాత త్రినాధ్ నక్కిన తీసిన సినిమా కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. దీంతో పాటు ఈ కథని తొలుత చిరంజీవి- సిద్దు జొన్నల గడ్డకి అనుకున్నారు. అయితే మజాకా చూసిన తర్వాత ఈ కథ చిరుకి సరిపడదనే ఫీలింగ్ కలిగింది. సినిమాని శివరాత్రి రోజున వదిలారు. నిర్మాతలు అనుకున్నంత ఫుట్ ఫాల్స్ రాలేదు. వీకెండ్ లో పుంజుకుంటుదనే నమ్మకంతో వున్నారు నిర్మాతలు.
ఫిబ్రవరి నెలలో చివరి సినిమాగా ఆది పినిశెట్టి శబ్ధంతో వచ్చాడు. వైశాలి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. అయితే అందులోని మ్యాజిక్ శబ్ధంలో కనిపించలేదనే రివ్యూలు వస్తున్నాయి. మొత్తనికి అన్ సీజన్ అనుకున్న ఫిబ్రవరిలో ఇన్ని కొత్త సినిమాలు వరుసకట్టడం అందులో తండేల్ లాంటి వంద కోట్ల సినిమా వుండటం విశేషమే.