2024 తెలుగు సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రారంభం దక్కలేదు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ పెద్ద విజయం సాధించిందనే సంతోషం తప్పితే గత ఏడాదిలా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి లాంటి పెద్ద విజయాలు ఈ ఏడాది సంక్రాంతికి నమోదు కాకపోవడం కచ్చితంగా లోటు.
ఫిబ్రవరి బాక్సాఫీసు కూడా చప్పగానే సాగిపోయింది. ఈ నెలలో డజనుకుపైగా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటీ ప్రభావాన్ని చూపలేదు. మంచి అంచనాలతో వచ్చిన రవితేజ ఈగిల్ నిరాశపరిచింది. నిజానికి సంక్రాంతి రావాల్సిన సినిమా ఇది. సంక్రాంతి పెద్ద విజయాలు లేని లోటు ఫిబ్రవరితో తీరుస్తుందని అంచనాలు పెట్టుకున్న అభిమానులని నిరుత్సాహపరిచిందీ ఈగిల్.
ఈ నెలలో వచ్చిన మరో ప్రామెసింగ్ సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీసు నెంబర్స్ డ్రాప్ అయిపోయాయి. సందీప్ కిషన్ ఆశించిన విజయం అయితే ఇవ్వలేకపోయింది.
సుహాస్ అంబాజీపేట, వైవా హర్ష సుందరం మాస్టర్, యాత్ర 2, రాజధాని ఫైల్స్, మస్త్ షేడ్స్ వున్నాయిరా, సిద్ధార్ రాయ్ .. ఈ సినిమాల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. డబింగ్ రూపంలో వచ్చిన రజనీకాంత్ లాల్ సలాం డిజాస్టర్ గా మిగిలింది. మలయాళం బొమ్మ భ్రమయుగంకు మంచి రివ్యూలు వచ్చాయి కానీ అందరూ ఎంజాయ్ చేసే సినిమా కాదది.
ఈ రకంగా ఫిబ్రవరి అంతా చప్పగా సాగిపోయింది. మార్చిలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, సిద్దుజొన్నల గడ్డ టిల్లు 2, గోపీచంద్ భీమా, విశ్వక్ గామి లాంటి ప్రామెసింగ్ సినిమాలు వున్నాయి. రిజల్ట్స్ ఎలా వస్తాయో చూడాలి.