ఈవారం సినీ ప్రేమికుకుల కావల్సినంత వినోదం దొరకబోతోంది. 4 సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. వీకెండ్ సరదాగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేయాలనుకుంటే మూడు సినిమాలు.. ఓటీటీలోనే వచ్చేస్తున్నాయి. అంటే మొత్తంగా 7 సినిమాలన్నమాట. రోజుకో సినిమా చెప్పున కేటాయిస్తే.. వారానికి సరిపడా సినిమాలున్నాయి.
ఈవారం రాబోతున్న పెద్ద సినిమా.. ఖిలాడీ. క్రాక్ తరవాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్.. ఇవన్నీ ఫుల్ మాసీగా ఉన్నాయి. రవితేజ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రమిదే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీలోనూ అత్యధిక థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈనెల 11న రాబోతోంది. ఈ వారం ఎన్ని సినిమాలున్నా… సగటు సినీ ప్రేమికుడి ఫస్ట్ ఛాయిస్ మాత్రం ఖిలాడీనే.
డిజే టిల్లు, సెహరి, ఎఫ్.ఐ.ఆర్.. ఈ మూడింటిపైనా దృష్టి పెట్టొచ్చు. 12న వస్తున్న డిజే టిల్లులో యూత్ కి కావల్సిన సరంజామా అంతా ఉంది. వేడి వేడి ముద్దులు, బోల్డ్ డైలాగులతో.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం. విష్ణు విశాల్ నటించిన `ఎఫ్.ఐ.ఆర్` ట్రైలర్ ఆకట్టుకుంది. విష్ణు విశాల్ కి తమిళ్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. తన కథలన్నీ కొత్తగా ఉంటాయి. అందుకే ఈ సినిమాపై దృష్టి పెట్టొచ్చు. `సెహరి` కూడా యూత్ ఫుల్ కథే. ట్రైలర్ కలర్ఫుల్ గా ఉంది.
ఇక ఓటీటీలోనూ సందడి మామూలుగా లేదు. ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన `భామా కలాపం` ఆహాలో వస్తోంది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన `మహాన్` అమేజాన్లో ఈనెల 10న విడుదల కాబోతోంది. సుమంత్ – నైనా గంగూలీ జంటగా నటించిన `మళ్లీ మొదలైంది` జీ 5లో వస్తోంది. ఇవన్నీ కొత్త సినిమాలే. నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. సో.. ఈ వారం వినోదాలకు ఢోకా లేనట్టే.