2021 ఆశావాహకంగానే మొదలైంది. జనవరిలో 4 పెద్ద సినిమాలొచ్చాయి. వాటిలో క్రాక్ మంచి వసూళ్లు దక్కించుకుంది. సూపర్ హిట్ గా నిలిచింది. పండక్కి వచ్చిన రెడ్ జస్ట్ ఓకే అనిపిస్తే, అల్లుడు అదుర్స్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఫిబ్రవరిపైనా టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ నెలలో విడుదలలు ఎక్కువ. ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చి కొత్త ఉత్సాహం నింపింది. అందుకే.. ఈ నెలపై టాలీవుడ్ ఫోకస్ పెట్టింది. అనుకున్నట్టే… విరివిగా సినిమాలొచ్చాయి. వారానికి కనీసం మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీసు దగ్గర క్యూ కట్టాయి. అయితే.. ఉప్పెన మాత్రమే బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వసూళ్లు పోటెత్తాయి. కొత్తవాళ్లతో తీసినా సరే, కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ సినిమా సాక్ష్యంగా నిలిచింది. దాదాపు ఫిబ్రవరి అంతా ఈసినిమా హవా కొనసాగింది. ఇదే నెలలో విడుదలైన `నాంది` ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తరవాత.. `హిట్` అనే కబురు నరేష్ చెవిన పడింది. నిర్మాతలకు భారీ లాభాలేం రాలేదు గానీ, బయ్యర్లు బ్రేక్ ఈవెన్ సాధించారు. రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాతలకు మంచి మొత్తమే ముట్టిందని, ఆ రూపంలో ఎంతొచ్చినా, లాభం కింద లెక్కే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఫిబ్రవరిలో చిత్రసీమ రెండు హిట్లు చూసినట్టు. ఇదే నెలలో విడుదలైన `జాంబీరెడ్డి` జస్ట్ ఓకే అనిపించుకుంది.
కాకపోతే.. ఫ్లాపులకు మాత్రం లెక్కేలేదు. నితిన్ – చంద్రశేఖర్ ఏలేటి కాంబో మ్యాజిక్ చేస్తుందనుకుంటే…. ఆ ఆశలకు `చెక్` పెట్టేశారు. ఈ సినిమా అటు విమర్శకులు, ఇటు మాస్… ఇలా రెండు వర్గాలకూ నచ్చలేదు. జగపతి బాబు చేసిన FCUK వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. ఈసినిమా విడుదలైన రెండో రోజే హెచ్ డీ ప్రింటు యూ ట్యూబ్‌లో దర్శనమిచ్చినా చూసేవాళ్లే లేరు. ఈ నెలలో విడుదలైన కపటధారి, పొగరు, అక్షర, మధుర వైన్స్, జీ ఫర్ జాంబీ, ప్రణవం.. ఇవన్నీ ఆత్తా పత్తా లేకుండా పోయాయి.
మార్చిలోనూ సినిమాల హవా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రతీ వారం మూడు నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అంటున్నాయి. వాటిలో క్రేజ్ ఉన్న సినిమాలకూ కొదవలేదు. మార్చిలోనూ టాలీవుడ్ కి మంచి హిట్లు పడితే.. 2021 కి శుభారంభం అందినట్టే.