“రైతుబంధు” పథకాన్ని కేసీఆర్ ప్రారంభించడం.. చెక్కుల అందుకున్న రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. వారి ఆనందం రూ. 4వేలకే పరిమితం. కానీ… దేశం మొత్తం ఉన్న మీడియా సంస్థలకు కూడా.. ఈ “రైతు బంధు” .. పెద్ద బంధువుగా మారింది. కారణం …వందల కోట్ల ఖర్చుతో.. దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ… ఈ పథకం యాడ్స్… ప్రముఖంగా కనిపించడమే. దేశంలోని లార్జెస్ట్ సర్క్యులెటెడ్ డైలీల్లో… ఆయా స్థానిక భాషల్లో కూడా.. ఫుల్ పేజీ యాడ్స్ వచ్చాయి. కేసీఆర్‌కు ఎందుకు ఇంత కీర్తి కండూతి అని చాలా మంది అనుకున్నారు. దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్‌ను ఊహించలేకపోయారు.
కేసీఆర్ కొన్ని రోజులుగా దేశ్‌కి నేతగా… ప్రచారంలోకి వస్తున్నారు. దీని కోసం ఆయన… ఫెడరల్ ఫ్రంట్ అనే కూటమిని ప్రారంభిచాలనుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు చేశారు. చాలా మందిని కలిశారు. నెలలో.. లేదా రెండు నెలల్లో ఫెడరల్ ఫ్రంట్ ఆఫీసు ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. ఈ ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా.. రైతే. కేసీఆర్ ముందు నుంచీ.. ఈ మాట చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి… సమృద్ధిగా ఉన్న నీళ్లను కూడా.. పొలాలకు అందివ్వలేకపోయాయన్నది కేసీఆర్ ఆ రెండు జాతీయ పార్టీలపై మోపుతున్న అభియోగం. రైతులందరికీ.. నీటి సౌకర్యం కల్పిండమే అజెండా అని… దానికి సంబంధించిన లెక్కలనూ చెబుతున్నారు. దీన్ని అన్ని రాష్ట్రాల్లోని రైతులు నమ్మాలంటే.. ముందుగా రైతులకు తానేం చేశానో చూపించాలనుకుంటున్నారు. అందుకే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నానని గొప్ప పథకం ప్రారంభించానని దేశం మొత్తం తెలిపేందుకు …. అన్ని భాషల్లోనూ ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణ యాడ్స్.. మా రాష్ట్రంలో ఎందుకొచ్చాయబ్బా.. అని ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యపోయారు కానీ ఎకరానికి నాలుగు వేలిస్తున్న కేసీఆర్ సుపరబ్బా అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నదే కదా..!.తాను తెలంగాణ రైతులకేం చేస్తున్నానో… ఫెడరల్ ఫ్రంట్ నేతగా అదే చేస్తానని కేసీఆర్ రైతుల్లోకి సందేశం పంపుతున్నారు.
ఇదే కాదు.. వచ్చే ఎన్నికల కంటే.. ముందే మరో సారి ప్రకటనల విశ్వరూపం మనం చూసే అవకాశం ఉంది. కోటి ఎకరాల మాగాణం అని మాటలలను.. కనీసం ప్రకటనల్లో అయినా కేసీఆర్.. ఏడాది చివరికి చేసి చూపించబోతున్నారు. కాళేశ్వరం పూర్తి చేసి.. కోటి ఎకరాలను నీరిస్తున్నామని… దేశం మొత్తం అదే విధంగా రైతులకు నీటి కష్టాలు లేకుండా చేద్దామని.. కేసీఆర్ ప్రచారం చేసుకోబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించి ఇది రెండో పోస్టర్ కానుంది. మొత్తానికి స్థానిక పథకాల్ని కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ చేసుకోవడంలో కేసీఆర్‌ను మించిన పొలిటికల్ లీడర్ లేరు.