మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ తెలంగాణకు వచ్చారు. నిజానికి, ఆయన వచ్చింది కాంగ్రెస్ నేత సుబ్బిరామిరెడ్డి మనవడి వివాహానికే అయినా.. సీఎం కేసీఆర్ తో ఆయన కాసేపు భేటీ కావడంతో రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే, ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ బెంగళూరు వెళ్లి, దేవెగౌడతో భేటీ అనంతరం దేశంలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటనలూ చేశారు. అప్పటికి కాంగ్రెసేతరం, భాజపాయేతరం అనే సిద్ధాంతానికి దేవెగౌడ కూడా కట్టుబడి ఉన్నట్టే కేసీఆర్ నమ్మారు! ఇద్దరూ సంయుక్త ప్రకటనలు కూడా చేశారు. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, దేవెగౌడ – కేసీఆర్ ల మధ్య జరిగిన భేటీ ఇది.
ప్రగతి భవన్ జరిగిన ఈ భేటీలో జరిగింది. ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నా.. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదనే రొటీన్ విషయాన్ని దేవెగౌడ చెప్పారు. సాధారణ అంశాలే తప్ప, రాజకీయంగా కీలకమైనవేవీ ఇద్దరి మధ్యా చర్చ జరగలేదని తెరాస వర్గాలు కూడా అంటున్నాయి. ఫెడరల్ ఫ్రెంట్ ను బ్యాక్ కి నెట్టేసి.. ముందస్తును ముందుకు తెచ్చే హడావుడిలో కేసీఆర్ ఉన్నారు అనడానికి ఇదే సాక్ష్యం. అందుకు మరో సాక్ష్యం.. దేవెగౌడతో భేటీ అయిన వెంటనే ఆయన గవర్నర్ దగ్గరకి వెళ్లారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నరసింహన్ తో కేసీఆర్ చెప్పారని సమాచారం. గద్వాల సభ చాలా బాగా జరిగిందనీ, రాష్ట్రంలో తమకు అనుకూలమైన పరిస్థితి ఉందనే విషయాన్ని గవర్నర్ కు చెప్పారట! సో.. కేంద్రం కోరినట్టుగానే ముందస్తుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు చూడొచ్చు. సవాల్ పేరుతో కాంగ్రెస్ ని కూడా ముందస్తుకు ఓకే అనిపించారు కదా! ఈ రిపోర్టు కూడా కేంద్రానికి ఇచ్చుకోవచ్చు.
ఇక, ఫెడరల్ ఫ్రెంట్ విషయానికొస్తే.. దేవెగౌడ, కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే, గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికల హడావుడిలోనే కేసీఆర్ కనిపిస్తున్నారు. ప్రధానమంత్రిని కలిసి వచ్చిన దగ్గర నుంచీ ఫెడరల్ ఫ్రెంట్ గురించి కేసీఆర్ మాట్లాడటం లేదు! రాష్ట్రాల్లో పర్యటిస్తా, మద్దతు కూడ గడతా, దేశ ప్రజల ముందు కొత్త అజెండా ఉంచుతా అని అన్నారుగానీ.. ఆ కార్యాచరణ కనిపించడం లేదు. ఇక, దేవెగౌడకి కూడా ప్రస్తుతానికి ఈ ఫ్రెంట్ గోల అవసరం లేదు. భాజపాకి వ్యతిరేకంగా పనిచేద్దామని అంటారేమోగానీ, కాంగ్రెసేతరం అనే పరిస్థితి జేడీఎస్ కి లేదు. భాజపాపై పోరాటం చేద్దామని దేవెగౌడ ప్రతిపాదించినా.. అందుకే కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా.. అంటే, ఆ ప్రశ్నకు ప్రస్తుతం వారి దగ్గర సమాధానం లేదు! ఒక కాంగ్రెసేతర ఫ్రెంట్ అంటే కేసీఆర్ సిద్ధపడతారేమో. కానీ, దేవెగౌడ అలా అనలేరుగా.