ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి అడుగులు వేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆమె కొంత సానుకూలంగానే స్పందించారు. ఒక్క పార్టీ దేశాన్ని పాలించడం సమర్థీనయం కాదని ఆమె చెప్పారు. తాము తొందరపడటం లేదనీ, సమీప భవిష్యత్తులో భావసారూప్యత గల పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని మమతా అన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్, భాజపాల్లో ఏ పార్టీతో కలిసి వెళ్లినా ప్రయోజనం లేదని అన్నారు. దేశ పునర్నిర్మాణానికి కొత్త రాజకీయాలు అవసరమనీ, దేశానికి ఫెడరల్ ఫ్రెంట్ ఆవశ్యకత ఉందన్నారు.
ఈ సందర్భంగా గమనించదగ్గ అంశాలు రెండు ఉన్నాయి. మొదటిది, ఈ ఫ్రెంట్ కి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశం ప్రస్తుతానికి కేసీఆర్ పక్కనపెట్టారు. నిజానికి, థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు అనగానే.. దానికి తానే నాయకత్వం వహించబోతున్నట్టు చెప్పుకున్నారు. తెరాస వర్గాల్లో కూడా ఇప్పటికీ అదే స్థిరమైన భావన ఉంది. దేశానికి కేసీఆర్ అవసరమనీ, ప్రధానమంత్రి అవుతారనే అభిప్రాయాలే రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఉమ్మడి నాయకత్వం అనే మాట వినిపిస్తోంది. సమష్టి నాయత్వంలో ఫ్రెంట్ ను పనిచేస్తుంది అంటున్నారు. ఎలాగైనా ఫ్రెంట్ ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో.. ఈ నాయకత్వ చర్చ అనేది పక్కన పెట్టారనుకోవాలి. దీంతోపాటు మరో కీలకాంశం… కాంగ్రెస్ పట్ల ఫెడరల్ ఫ్రెంట్ వైఖరి ఏంటనేది కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తోంది. భాజపాతోపాటు కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకించాలన్నది కేసీఆర్ ఆలోచన. కానీ, తెలంగాణలో కేసీఆర్ కి కాంగ్రెస్ వైరివర్గం కావొచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీలకు కాకపోవచ్చు. ఇప్పుడు ఏయే పార్టీలతో కేసీఆర్ ఫ్రెంట్ అని అంటున్నారో.. వాటిలో చాలా పార్టీల నేతలు ఇటీవలే సోనియా గాంధీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు.
ఫెడరల్ ఫ్రెంట్ కి నాయకత్వం, కాంగ్రెస్ తో ఎలా వ్యవహరించాలి.. ఈ రెండూ ప్రస్తుతానికి కేసీఆర్ పక్కన పెట్టినట్టున్నారు. కానీ, ఈ రెండే భవిష్యత్తులో సమస్యలుగా మారబోతాయనేది విశ్లేషకుల అంచనా. అయితే, ఏదో ఒక జాతీయ పార్టీ అండ లేకుండా సుదీర్ఘ కాలం మూడో ప్రత్యామ్నాయ వేదిక మనుగడ సాధ్యమా అనేదే ప్రశ్న..? ఎందుకంటే, గతంలో నేషనల్ ఫ్రెంట్ భాజపాతో ఉంది, యునైటెడ్ ఫ్రెంట్ కాంగ్రెస్ తో ఉంది. వీటి మనుగడ కూడా కష్టసాధ్యంగానే సాగింది. కాబట్టి, ఈ అనుభవాలన్నీ దృష్టి పెట్టుకుని.. ప్రాంతీయ పార్టీల ఉమ్మడి అజెండాను ముందుగా ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనుభవాన్ని కూడా ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంది. మమతా బెనర్జీ, శరత్ పవార్, చంద్రబాబు లాంటి నేతలతో పోల్చుకుంటే.. జాతీయ స్థాయిలో రాజకీయాలు నెరపిన అనుభవం కేసీఆర్ కి లేదన్నది వాస్తవం. కాబట్టి, ఈ సవాళ్లను ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.