రాజధాని నిరసనల కారణంగా… ఆంధ్రప్రదేశ్లో మిగతా సమస్యలు బయటకు రావడం లేదు.. కానీ పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లెక్కుతున్నారు. ఎందుకంటే.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి పైసా కూడా స్కాలర్ షిప్ రాలేదు. కాలేజీలకు ఫీజు రీఎంబర్స్ కాలేదు. నవరత్నాల్లో భాగంగా … ఫీజులు వంద శాతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకూ ఆ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించలేదు. పాత విధానం ప్రకారం.. విద్యార్థికి రూ. 35వేల వరకూ ఫీజు రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది. అది కూడా… చేయడం లేదు. గతంలో టీడీపీ సర్కార్ మూడు నెలలకు ఓ సారి ఫీజు బకాయిలు చెల్లించేది. ఏడు నెలలు అయినా.. రూ. 3400కోట్లకు బకాయిలు చేరినా… ప్రభుత్వం చెల్లించడం లేదు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇవ్వకపోవడంతో.. కాలేజీల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోతూండటంతో.. వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. యాజమాన్యం కూడా.. విద్యాపరంగా చేయాల్సిన వ్యవహారాలను చేపట్టడం లేదు. దాంతో.. మొక్కుబడిగా కాలేజీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సిలబస్ గురించి కానీ… ప్రాక్టికల్స్ గురించి కానీ పట్టించుకునేవారు లేరు. కాలేజీల అసోసియేషన్లు ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి.. ఫీజుల కోసం.. డిమాండ్ చేస్తే.. తర్వాతి రోజు వారి కాలేజీల్లో సోదాలకు పోలీసులు వెళ్తున్నారు. దాంతో.. నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే.. అధికార పార్టీకి చెందిన కొంత మంది సన్నిహితుల కాలేజీలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా అయితే.. నిబంధనల ప్రకారం.. ఫీజు రీఎంబర్స్ నిధులు మంజూరు విడుదల సమానంగా జరగాలి. వివక్ష చూపకూడదు. కానీ.. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండేవారికి మాత్రం చెల్లింపులు జరిగిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు తన కాలేజీలకు ఫీజు బకాయిలు ఉన్నాయంటూ.. రోడ్డెక్కిన మోహన్ బాబు కాలేజీలకు మాత్రం… మొత్తం చెల్లించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన నోరు మెదపలేదంటున్నారు.