తొమ్మిదిరోజుల సంబరాల తరువాత గణపతి నిమజ్జనం లో ఒక విధమైన సాంస్కృతిక, భావసమైక్యత పటిష్టమౌతున్నట్టు కనబడుతోంది. మానసికమైన సంతృప్తి, ఆనందాలతోపాటు ఇందులో డబ్బుసేకరించడం, దాన్ని ఖర్చుచేయడం అనే ‘ఆర్జిత సేవ’ వల్ల కమ్యూనిటీలో డబ్బు రోటేషన్ ద్వారా ఎకనమిక్ స్టిమ్యులేషన్ కూడా వుండటం ఆర్ధిక ప్రమోజనం కూడా! పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో ఈసారే బహుజనుల ముద్ర స్పష్టంగా కనబడుతోంది. గణేశ్ నిమజ్జనం ఫోకస్ అంతా హైదరాబాద్ మీదే వుండటం వల్ల ఆంధ్రాలో గత ఏడెనిమిదేళ్ళుగా విస్తరిస్తున్న ఈ ధోరణి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు.
ప్రజల సాంస్కృతిక జీవనం మూలాలు తెగిపోని తెలంగాణాలో బతుకమ్మ,బోణాల పండుగలు-ఆ సమాజంలో జీవన వైవిధ్యాలమధ్య ఉద్వేగపూరితమైన సమైక్యతను సమగ్రతను పటిష్టం చేస్తోంది. తెలంగాణా మాదిరిగానే సీమాంధ్రలో కూడా సాంఘిక, ఆర్ధిక తారతమ్యాలు, కులపరమైన వివక్ష వున్నాయి. అయినా కూడా తెలంగాణాలో సమజంలో మాదిరిగా జనులందరినీ అవసరానికి కలిపి వుంచే అంతస్సూత్రం సీమాంధ్రలో అంతగా లేకపోవడానికి కారణం మూడువందల ఏళ్ళ పాటు పడిన ఇంగ్లీషు నీడలే. ఈ నీడల కింద ఊరికీ మనిషికీ మధ్య వుండవలసిన సజీవ సంబంధాలు చచ్చుబడిపోయాయి.
సర్వజనులలో విస్తరిస్తున్న విద్యాబుద్ధులు, చైతన్యాలు ఒకవైపు,- ఉనికిని చాటుకోవలసిన అస్ధిత్వ ఉద్యమాలు మరోవైపు – వృత్తులవారీగా, కులాలవారీగా వున్న ప్రజల్ని చిన్నచిన్న కమ్యూనిటీలుగా కూడగడుతున్నాయి.
సాధారణంగా దేవాలయాలు కేంద్రంగా సాగే మతపరమైన కార్యకలాపాలకు వేలవేల మంది హాజరైనా వాటి పరిధి మహా అయితే కుటుంబానికే పరిమితం. గుడికి వెళ్ళి దేవుణ్ణి పూజించుకునే సంపన్నుల, విద్యావంతులైన మధ్యతరగతి ప్రజల సాంప్రదాయాన్నే పేదవారు, పనులతోనే రోజుగడుపుకునే వృత్తుల వారూ పాటించేవారు. ఆలయప్రాంగణాల్లో గంటలతరబడి గడపగలిగిన వెసులు బాటు అనేక కులాలుగా, వృత్తులుగా వున్న 60 నుంచి 70 శాతం మంది బహుజనులకు సాధ్యపడదు. గుడితో సంబంధం లేకుండా దేవుణ్ణే వీధుల్లో నెలకొల్పి, తొమ్మిదిరోజుల పాటు పూజించి, ఆడి, పాడి, ఊరేగింపుగా తీసుకువెళ్ళి నీటిలో నిమజ్జనం చేయడం ‘ ఉన్నత, మధ్య తరగతి’ వారివల్ల ఆయ్యేపని కాదు.
వెనుకబడిన తరగతుల వారు లేదా బిసిలుగా పిలిచే బహుజనుల సంఘబలం వల్లే ఇది సాధ్యమౌతోంది. పనివారు, పేదలు కిక్కిరిసి వున్న పారిశ్రామిక వాణిజ్య నగరమైన ముంబాయిలో ఈ సాంప్రదాయం రెండువందల ఏళ్ళకంటే ముందునుంచీ వుంది. జాతీయ భావసమైక్యతను చాటిచెప్పడానికి దేశమంతటా వినాయక నిజ్జనాలు జరపాలని స్వాతంత్రోద్యమ నాయకుడు 1893 లో పిలుపు ఇచ్చినప్పటినుంచీ గణపతి నవరాత్రులు దేశవ్యాప్త సంబరాలయ్యాయి.
అస్ధిత్వ ఉద్యమాలు, భావనల వల్ల ఏడెనిదేళ్ళ నుంచీ సీమాంధ్రలో గణేష్ పందిర్లు పెరిగిపోతున్నాయి. జంక్షన్లలో, పెద్ద పెద్ద వీధుల్లో షామియానాలు వేసి వినాయకుడి విగ్రహాలు పెట్టి పూజలు చేసి ప్రసాదాలు పంచి డాన్సులు చేయించే కమిటీలు పెరుగుతున్నాయి. రోజువారీ పనులు ఆపుకోకుండా, సాయంత్రం నుంచీ దేవుడి పందిరిదగ్గరే వుండేలా ఈ కార్యక్రమాలు వుంటాయి. విగ్రహం నెలకొల్పడానికి, లౌడ్ స్పీకర్లు పెట్టడానికి పోలీసు అనుమతి తీసుకోవాలని కనీసం 20 శాతం కమిటీలకు తెలియడం లేదని ఒక పోలీసు అధికారి చెప్పారు.
నాలుగు లక్షలమంది జనాభా వున్న రాజమండ్రిలో ఇంతకుముందెన్నడూ లేనంత ఎక్కువగా ఈఏడాది 1400 వరకూ వినాయకుడి ఊరేగింపులు జరగుతూండటం గమనార్హం. రాష్ట్రవిభజనకు ముందు ”జై సమైక్యాంధ్రా” నినాదంతో సీమాంధ్ర అంతటా అనూహ్యమైన భారీ భారీ ప్రజా ప్రదర్శనలు జరిగాయి. వాటిలో 80 శాతం ఊరేగింపులు ”బహుజనుల” అస్ధిత్వ ప్రదర్శనలే! ఇపుడు ఆంధ్రప్రదేశ్ ల కనిపిస్తున్నవి అదే బహుజనుల సాంస్కృతిక, భావ సమైక్యతా రూపాలే!!