ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి నాదేండ్ల మొదటి నుండి చెబుతూనే వచ్చారు. రాష్ట్రమంతా ఒక ఎత్తైతే… కాకినాడ కేంద్రంగా సాగుతోన్న అక్రమ రేషన్ దందాను పూర్తిగా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు.
కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందాపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై అనేక ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో ద్వారంపూడిని జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగానే హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి అక్రమాలన్నీ క్లోజ్ చేస్తూ వస్తుండగా, రేషన్ దందాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల స్వయంగా రంగంలోకి దిగారు.
ద్వారంపూడి అనుచరులకు సంబంధించిన గోడౌన్లలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచగా… అధికారులు పట్టుకున్నారు. కాకినాడ పోర్టు నుండి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న అనుమానాలున్నాయి.
ఇంత చేసినా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగటం లేదు. తాజాగా మరో ఆరు లారీలు పట్టుబడటంతో… ఎనిమిది విభాగాల అధికారులతో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి ముంబయి రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొన్న ఒక్క రోజునే ఆరు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా దందా సాగిస్తోందని ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు.