ఫైబర్ నెట్ లో జరిగిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బహిరంగంగా ఆరోపణలు చేసుకోడంతో మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైర్మన్ జీవీ రెడ్డితో రాజీనామా చేయించారు. ఆయన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరో వైపు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు అదనంగా ఉన్న ఆర్టీజీఎస్, గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల్ని కూడా తప్పించారు. పోస్టింగ్ లేకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఫైబర్ నెట్ లో అసలేం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఇతర సీరియస్ గా చర్యలు తీసుకున్నదంటే.. ఏదో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. జీవీ రెడ్డిని రాజీనామా చేయమన్నందుకే ఆయన ఫీల్ అయి పార్టీకి కూడా రాజీనామా చేశారని చెబుతున్నారు. మరో వైపు దినేష్ కుమార్ వైపు కూడా తప్పులు ఉన్నాయని ఆయనను కూడా బదిలీ చేశారు. ఇక్కడ ప్రభుత్వం పరిపాలనా పరంగా కఠినంగా వ్యవహరించినప్పటికీ.. రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత పాజిటివ్ గా ఉండాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జీవీ రెడ్డి ఫైబర్ నెట్ లోకి వెళ్లిన తర్వాత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన వారిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అప్పనంగా జీతాలు పొందిన వారిని ఉద్యోగం నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. పైబర్ నెట్ ను మళ్లీ ట్రాక్ లోకి పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయన ఐఏఎస్ అధికారి, ఎండీపై నేరుగా ఆరోపణలు చేయడం మాత్రం కలకలం రేపింది. ఇలాంటివి సంబంధిత శాఖ మంత్రి దృష్టికో.. చంద్రబాబు, నారా లోకేష్ దృష్టికో తీసుకెళ్లి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జీవీ రెడ్డి వ్యవహారం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరమే. సమస్యను సరిగ్గా డీల్ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.