థాయిలాండ్ రాజధాని సెంట్రల్ బ్యాంకాక్ లో రచప్రసాంగ్ అనే ప్రాంతంలో గల బ్రహ్మ దేవుని ఆలయం వద్ద సోమవారం సాయంత్రం (స్థానిక కాలమాన ప్రకారం) సుమారు ఏడు గంటలకు భారీ బాంబు ప్రేలుడు జరిగింది. ఈ ప్రేలుడులో 15మంది అక్కడికక్కడే మరణించగా అనేక మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. బాంబులను మోటార్ సైకిల్ కి అమర్చి ఆలయ సమీపంలో నిలిపి ప్రేల్చినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలియగానే అక్కడికి చేరుకొన్న బాంబు స్క్వాడ్లు అక్కడే మరొక బైక్ పై అమర్చి ఉన్న ఇంకో బాంబుని కనుగొని అది ప్రేలక ముందే నిర్వీర్యం చేశారు. తక్షణమే అక్కడికి చేరుకొన్న థాయ్ భద్రతాదళాలు ఆలయ పరిసరాలను చుట్టుముట్టు తనికీలు నిర్వహిస్తున్నాయి. సాయంత్రం ఏడు గంటలకి మంచి రద్దీగా ఉండే సమయం, ప్రాంతాన్ని ఎంచుకొని ఎవరో బాంబులు అమర్చడంతో ప్రేలుడుకి చాలామంది బలయిపోయారు. మరొక బాంబు కూడా ప్రేలి ఉండి ఉంటే ప్రాణ నష్టం మరింత అధికంగా ఉండేది. ఈ ప్రేలుడికి కారకులెవరో, వారు ఎందుకీ పని చేశారో తెలియదు. కానీ ఇది దేశంలో ముస్లిం ఉగ్రవాద సంస్థల పనే అయ్యుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షత గాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రేలుడులో చాలా మంది తీవ్రంగా గాయపడటం వలన చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం మరో 12 మంది చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.