తెలంగాణాలో నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి కర్నూలులో మూడు రోజుల నిరాహార దీక్షకి కూర్చోవడంతో, తెదేపా, వైకాపా, తెరాసల మద్య మళ్ళీ యుద్ధం మొదలయిపోయింది. అసలు జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించగా, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణా ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ లో నీటి కరువు వస్తుందని తెలిసి ఉన్నా, ఓటుకి నోటు కేసుకి భయపడి చంద్రబాబు నాయుడు వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. ఈవిధంగా మూడు పార్టీల నేతలు కలిసి ఒకరినొకరు నిందించుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
కృష్ణా నీటిలో తమకు న్యాయంగా వచ్చినవాటా నీళ్ళనే వాడుకొంటాము తప్ప ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం చేసే ఉద్దేశ్యం తమకు లేదని హరీష్ రావు చెప్పారు. అయితే శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, తెలంగాణా ప్రభుత్వం దానికి 85అడుగుల దిగువన అంటే 800 అడుగుల ఎత్తు నుంచే రోజుకి 2 టి.ఎం.సి.ల నీళ్ళు తోడేసుకొనేందుకు వీలుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని నిర్మిస్తోంది. క్రింద నుంచి అది రోజూ నీళ్ళు తోడేసుకొంటుంటే ఆ జలాశయంలో పూర్తి స్థాయి (885 అడుగులు) వరకు ఎలాగ నిండుతుంది? కనీసం 834 అడుగుల ఎత్తు వరకు నీళ్ళు ఉంటే తప్ప హెచ్.హెచ్.ఎన్.ఎస్. ప్రాజెక్టుకి నీళ్ళు రావు. కనీసం 854 అడుగులుంటే తప్ప రాయలసీమకు నీళ్ళు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్ళు అందించే వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్ళు రావు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా 120 టి.ఎం.సి.ల నీళ్ళు తోడుకొనేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే చాలా భారీ వర్షాలు పడితే తప్ప శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నిండదు. క్రిందకి నీళ్ళు రావు. అదే కనుక జరిగితే శ్రీశైలం జలాశయం దిగువనున్న నాగార్జున సాగర్, పులి చింతల, ప్రకాశం బ్యారేజిలకు కూడా నీళ్ళు చేరవు. అటువంటి పరిస్థితే గనుక ఏర్పడితే వాటిపై సాగవుతున్న లక్షలాది ఎకరాలలో పంటలు మానుకోవలసిందే. ఇదీ వాస్తవ పరిస్థితి.
దీనిపై మూడు పార్టీలు, రెండు ప్రభుత్వాలు రకరకాల మాటలు చెపుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్రలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు నిర్మిస్తూ దిగువనున్న తెలంగాణాకి అన్యాయం చేస్తున్నాయని వాదిస్తున్న తెలంగాణా ప్రభుత్వం, తను కూడా అదే పొరపాటు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. పైగా ఈ ప్రాజెక్టుల వలన ఆంధ్రాలో నీటికి కరువు ఏర్పడదని హరీష్ రావు భరోసా ఇవ్వడం విచిత్రమనుకొంటే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని, హరీష్ రావుని నిలదీయవలసిన జగన్, తెదేపా నేతలు ఒకరినొకరు విమర్శించుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.